గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతుల నిరసన
కొయ్యలగూడెం: వ్యవసాయ పొలాలు ముంపు బారిన పడకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంతం వద్ద వరద నీటి సరఫరాకి తూరలు ఏర్పాటు చేయాలని రైతులు శనివారం ఆందోళన చేశారు. పొంగుటూరు–కన్నాయిగూడెం గ్రామాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే స్మాల్ వెహికల్ అండర్ పాస్ (ఎస్‌వీయూపీ) వంతెన నిర్మాణం జరిగిందని అయితే వరద సమయంలో హైవేకి ఇరువైపులా ఉండే నీటి పారుదలకు వీలు లేకుండా నిర్మాణం చేశారని రైతులు ఆరోపించారు. దీనివల్ల వర్షాల సమయంలో, వరదలు సంభవించినప్పుడు నీరు పారుదల లేక ఎగువన ఉన్న పొలాలు ముంపు బారిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్‌కి రెండు సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని తెలిపారు. పొంగుటూరు, కన్నాయగూడెం, యాదవోలు రోడ్డు సైతం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన అధ్వానంగా తయారైందని, దానికి కూడా హైవే నిర్వాహకులు బాధ్యత వహిస్తామని చెప్పి, ఆపై నిర్లక్ష్యం చేశారని రైతులు, ప్రజలు పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు(మెట్రో)/ భీమవరం (ప్రకాశం చౌక్): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకపక్క రెవెన్యూలో అనేక విధులతో వీఆర్వోలు ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో పక్క గ్రామ, వార్డు, సచివాలయల అధికారులు ఇచ్చిన సర్వేలు, బయోమెట్రిక్, ఇతర ఆదేశాలు అమలు చేయాలని ఒత్తడి చేయడం తగదన్నారు. ఈ నెల 19న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి వీఆర్‌వోల సమస్యలను తీసుకువెళ్లామని, 24న ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారన్నారు. అయినా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వకపోగా, రెవెన్యూ విధులతో పాటు జీఎస్‌డబ్ల్యూఎస్, సర్వేలు, ఇతర విధులు చేయాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. తమ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ ఉన్నత అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు ఉన్నారు.


