బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు
ఆకివీడు : వినియోగదారులకు విశిష్ట సేవలందిస్తున్న జిల్లా వినియోగదారుల సంఘాల అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య గురువారం రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో సివిల్ సప్లయ్ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బంగారయ్య చెప్పారు. గత 36 ఏళ్లుగా వినియోగదారులకు చేసిన సేవల్ని గుర్తించి ఈ అవార్డు బహుకరించారన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం గురువారం భక్తజన సంద్రమైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం అనుకోకుండా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపైన ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
పాలకొల్లు సెంట్రల్: తండ్రి అంతిమ సంస్కారాల్లో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణంలోని గుత్తులవాని పేటకు చెందిన పంపన నరసింహస్వామి (రాజు) (43) ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తుంటాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు గురువారం మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. అంతిమ సంస్కారాల్లో భాగంగా అబ్బాయిలు లేకపోవడంతో కుమార్తె ముందుకు వచ్చి తండ్రి రాజుకు తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన పలువురు కంటతడి పెట్టారు.
భీమవరం: రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీల్లో మరో 2 జట్లు క్వార్టర్స్ దశకు చేరాయి. భీమవరంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం అమలాపురం, తిరుపతి జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన పోటీల్లో వైజాగ్ జట్టుపై తిరుపతి, భీమవరంపై అమలాపురం, వైజాగ్‌పై చైన్నె, కాకినాడ కార్తికేయ టీమ్‌పై కాకినాడ రుద్ర టీమ్, ఖమ్మంపై తిరుపతి, విజయవాడపై చైన్నె కాకినాడపై వైజాగ్, వైజాగ్‌పై అమలాపురం జట్లు విజయం సాధించాయి.
ఆకివీడు: రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానిక ఐ భీమవరం రహదారిలో మూడు తుమ్ముల వద్ద గురువారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భీమవరంనకు చెందిన సుదీప్ కాలు విరగడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి 108లో వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నట్లు స్థానికులు చెప్పారు.
బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు
బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు
బంగారయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు


