గోదావరి మాత పురస్కారాల ప్రదానం
గణపవరం: గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో గురువారం గోదావరి మాత అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి, సత్కరించడం ద్వారా నేటి తరానికి వారి సేవలను పరిచయం చేసే అవకాశం లభిస్తుందన్నారు. గణపవరంలో గోదావరి మాత పేరిట మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో లబ్దప్రతిష్టులైన పలువురు ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌వీఎస్ రాజు దంపతులను అభినందించారు. ఈఏడాది డీవీడీ సత్యనారాయణ (పద్యకవిత రంగం), జి.అన్నపూర్ణ (సంగీతం), బత్తులు రాజు (చిత్రకళారంగం, పిప్పర), చిలువూరి రామకృష్ణంరాజు (సినీ నాటకరంగం దర్శకులు)లకు గోదావరి మాత అవార్డులు, నగదు, జ్ఞాపికలను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ భవనం ఉపాధ్యక్షుడు వంకాయల రామారావు, కార్యదర్శి నడింపల్లి రాంపండు, త్యాగరాజ కళాక్షేత్రం కార్యదర్శి మాదేటి సురేష్, తెలుగు రచయితల సంఘం జిల్లా కార్యదర్శి తెన్నేటి లక్ష్మీనర్సింహమూర్తి, యండపల్లి పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.


