ఆడుకుంటూ మాయమై అనంత లోకాలకు
పెనుగొండ: ఆడుతూ..పాడుతూ కానరాని లోకాలకు చేరి తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చాడో బాలుడు. గురువారం పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద ఆటలాడుతూ మాయమై చివరికి చెరువులో శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే ఇరగవరం మండలం తూర్పువిప్పరు శివారు ఆర్ ఖండ్రికకు చెందిన జొన్నల ధనరాజు పెనుగొండ పంచాయతీ పార్కు వద్ద స్వీట్సు, బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధనరాజుకు కుమారుడు, కుమార్తే సంతానం. గురువారం క్రిస్మస్ సెలవుకు కావడంతో కుమారుడు ఈశ్వర దుర్గా సత్య వెంకటేష్ అలియాస్ ఈశ్వర్ (5)ను తీసుకువచ్చి పార్కులో కుమారుడుతో కలసి ఆటలాడాడు. ఇంతలో బేకరీలో బేరం రావడంతో ధనరాజు పనిలో నిమగ్నం కాగా తరువాత బాలుడి కనిపించలేదు. ఎంత వెతికినా కపించకపోవడంతో గ్రామ సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ చొరవతో, పెనుగొండ ఎస్సై కే గంగాధర్ సిబ్బంది చెరువులో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో పార్కు వద్ద తీవ్ర విషాదం నెలకొంది. కాగా బాలుడు మాయం కావడంతో పెనుగొండలో కిడ్నాప్ అంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అనుమానంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యం కావడంతో కిడ్నాప్ ప్రచారానికి తెరపడింది.


