కనుల పండువగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రంలో గురువారం శ్రీవారి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామి వారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.


