కుక్కను తప్పించబోయి వ్యక్తి దుర్మరణం
మండవల్లి: కుక్కను తప్పించబోయి మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన మట్టా ఏడుకొండలు (36) స్క్రాప్ వ్యాపారం చేసుకుని జీవిస్తుంటాడు. తాడేపల్లి సమీపంలోని జగన్నాధపురంలో నివాసముంటున్న భార్యను తీసుకురావడానికి ఈనెల 23వ తేదీన వడాలి నుంచి మోటార్ సైకిల్‌పై మండవల్లి వైపుకు వస్తున్నాడు. కానుకొల్లు జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడడంతో తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడ్ని స్థానికులు 108 వాహనంపై గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్నయ్య సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


