తాటాకిల్లు దగ్ధం
చాట్రాయి: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైన ఘటన జనార్థనవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నడిపింటి రాంబాబు తాటాకింటిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. వంట సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్లతోపాటు బంగారం, నగదు, ధాన్యం దగ్ధమవ్వడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.
భీమవరం: భీమవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అధ్యాపకుడు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని అడిగేందుకు సంబంధిత కళాశాలకు వెళ్లిన విద్యార్థి సంఘ ప్రతినిధులపై ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారంటూ ఆరోపించారు. ఎస్సై రామారావు, సిబ్బంది సంఘటన జరిగిన ప్రాంతానికి బుధవారం వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థిని కొట్టిన అధ్యాపకుడ్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెప్పింది.
ఏలూరు (టూటౌన్): ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధనా, ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు బోధించడం జరుగుతుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైనవారికి సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95733 37484, 72869 93033, 94923 37469 నంబర్లలో సంప్రదించాలన్నారు.


