గ్రామసభను అడ్డుకున్న గిరిజన సంఘాలు
బుట్టాయగూడెం: రెడ్డిగణపవరంలో పోలవరం నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూములకు సంబంధించి మంగళవారం రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అయితే ఈ గ్రామసభను ఆదివాసీసేన, సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఆదివాసీ సేన నాయకుడు మడకం వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు పి.మంగరాజు, గిరిజన సంఘం నాయకులు పోలోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల కోసం వివాదంలో ఉన్న భూములను సేకరిస్తున్నారని గతంలో గ్రామసభను అడ్డుకున్నట్లు తెలిపారు. రెడ్డిగణపవరం పరిధిలో సుమారు 400 ఎకరాలకు పైగా భూములను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారని, వీటిలో అత్యధికంగా ఎల్‌టీఆర్, 1/70 చట్ట పరిధిలో ఉన్నవని, ఎంతోకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను చెప్పారు. మళ్లీ ఆ వివాదస్పద భూములకు సంబంధించి గ్రామ సభ నిర్వహించడం తగదన్నారు. దీనిపై ఎస్‌డీసీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి భూమిని సర్వే చేసిన తర్వాత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వివాదంలేని భూములను మాత్రమే సేకరిస్తామని చెప్పారు. అయితే అప్పటివరకూ గ్రామసభ జరపవద్దని చెప్పడంతో గ్రామసభ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పీవీ చలపతిరావు, డీటీలు, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.


