26 నుంచి జాతీయస్థాయి నృత్య పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏలూరుకు చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్యభారతి 30వ వార్షిక జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు నిర్వహించనున్నట్టు సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు మనోహర్ గోపాల్ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సంస్థల సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో యువ నర్తకులకు, నాట్యాచార్యులకు, సేవా మూర్తులకు అవార్డులు అందజేస్తామన్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారి నర్తకులకు కూచిపూడి, జానపద, బృంద నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు ముందుగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో అభినయ నృత్యభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్యోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. అంతకు ముందు ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అంబికా కృష్ణ ఆవిష్కరించారు.


