మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Dec 7 2025 8:40 AM | Updated on Dec 7 2025 8:40 AM

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

చింతలపూడి: ప్రజల మద్దతుతో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. చింతలపూడిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్‌ కంభం విజయరాజు అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రానికి 17 మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సైతం అందించలేని దుర్భర పరిస్థితుల్లో ఉందని విమర్శించారు. పార్టీ అధినేత జగన్‌ పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈనెల 10న జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చాలని సూచించారు. ఈనెల 15న జిల్లా నుంచి భారీ ర్యాలీగా కోటి సంతకాల పత్రాలను రాష్ట్ర కార్యాలయానికి చేరుస్తామని చెప్పారు.

పేద విద్యార్థులకు నష్టం

ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ వైద్య కళాశాలలను నడపలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిందని, దీంతో లక్షలాది మంది పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.

విజయవంతం చేద్దాం

పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గం నుంచి కోటి సంతకాల పత్రాలను చేరవేసే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 10, 15 తేదీల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

కుట్రలను తిప్పికొడదాం

నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కోటి సంతకాల సేకరణ పత్రాలను ఉదయం 10 గంటల కల్లా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చేలా సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులను తమకు అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా పార్టీ సీనియర్‌ నేత మందలపు సత్యనారాయణ మృతికి కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి, ఎంపీపీ డాక్టర్‌ బి.రాంబాబు నాయక్‌, జెడ్పీటీసీ ములుగుమాటి నీరజ సుధాకర్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌.రమే ష్‌రెడ్డి (చింతలపూడి), ఎ.శాంతారావు (లింగపాలెం), రాయకుల సత్యనారాయణ (కామవరపుకోట), జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు గుప్తా, జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ దయాల నవీన్‌ బాబు, రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శి గోలి చంద్రశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి చిలుకూరి జానారెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి గోలి శరత్‌ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్‌, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, చింతలపూడి పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి మల్నీడి బాబి, నాయకులు చల్లగోళ్ల రవిబాబు, బీవీఆర్‌ చౌదరి, ఎ.సుబ్బారావు, కె.చండీప్రియ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement