భీమడోలు: గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ శనివారం కేసు వివరాలను వెల్లడిస్తూ.. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను భీమడోలు పోలీసులు తనిఖీ చేస్తున్నారన్నారు. రెండు బైక్‌లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటూకూరి శామ్యూల్, కై కరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిషాంత్, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 40 వేల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వానం చేసుకుని వారిని అరెస్ట్ చేసారు. వారిని భీమడోలు సివిల్ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని సీఐ తెలిపారు.
కొయ్యలగూడెం: జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం కార్మికుడిని బలి తీసుకుంది. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం లచ్చూ సింగ్ (42) జేసీబీ కన్వేయర్ గేర్ బాక్స్‌లో చిక్కుకుని శనివారం ప్రాణాలు కోల్పోఓయాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన లచ్చూ సింగ్ మరో ఇద్దరితో కలిసి గత ఏప్రిల్‌లో వలస కార్మికులుగా వచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పనులు నిర్వహిస్తుండగా జేసీబీ రిపేరుకు గురైంది. దీంతో వినోద్ అనే మరొక వ్యక్తితో కలిసి గేర్ బాక్స్ సరి చేస్తున్న సమయంలో జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిపాడు. దీనిని గమనించిన మరొక వ్యక్తి వినోద్ దూకి ప్రాణాలను రక్షించుకోగా లచ్చూ సింగ్ జెసీబీకి, గేర్ బాక్స్ కి మధ్య చిక్కుకుపోయి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని గోపాలపురం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు