
ఉండలేక.. కట్టుకోలేక..!
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియను చేపట్టకపోవడంతో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. పరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారన్నది స్పష్టత ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చెందిన ఇళ్లలో ఉండలేక, కొత్త ఇంటి నిర్మాణం చేపట్టలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో ప్రభుత్వం ఇటీవల ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ వ్యక్తిగత, ఇంటి నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. అయితే ఇంకా కొందరికి పరిహారం రావాల్సి ఉంది. ప్రభుత్వం 41 కాంటూర్ అంటూ పరిహారం చెల్లించిన గ్రామాలను 2022లో వచ్చిన గోదావరి వరదలకు గిరిజనులు కనీసం ఖాళీ చేసింది లేదు. అయితే అదే వరదలో 45 కాంటూర్ అని పేర్కొన్న గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అలా వరదలో దెబ్బతిన్న ఇళ్లనే నిర్వాసితులు బాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు వాటి స్థానంలో తాత్కాలికంగా కర్రలు, రేకులతో షెడ్డు వేసుకుని చుట్టూ బరకాలు కట్టుకుని బతుకుతున్నారు.
స్పష్టత లేకపోవడంతో..
ప్రభుత్వం 45 కాంటూర్ పరిధి గ్రామాలకు పరిహారంపై స్పష్టత ఇస్తే ఇంటి నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చనే భావనలో నిర్వాసితులు వేచి చూస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకుంటే, కొత్త వాటిని కాదని పాత ఇంటి విలువ ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు ఆవేదన చెందతున్నారు. ఇలానే 41 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు ఇప్పటికే నష్టాన్ని చవిచూశారు. అదీ కాక పరిహారం ఎప్పుడిస్తారు, గ్రామాలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు, అసలు చేయిస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇంటి నిర్మాణాలపై ఎలా ముందుకు వెళతామని అంటున్నారు. 45 కాంటూర్ పరిధికి చెందిన నిర్వాసిత గ్రామాల పరిహారం విషయమై ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాలని కోరుతున్నారు.
సంజయ్‌నగర్ కాలనీలో రేకులతో ఆవాసం
కుక్కునూరు బీ బ్లాక్‌లో బరకాలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం
ముంపు గ్రామాల్లో తాత్కాలిక ఆవాసాలు
పరిహారం చెల్లింపులో ప్రభుత్వ తాత్సారం
నిర్వాసితులకు తప్పని అవస్థలు

ఉండలేక.. కట్టుకోలేక..!