
ఆక్వాకు వాయు‘గండం’
గణపవరం: వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఆక్వా సాగుకు గండంగా మారాయి. భారీవర్షాలు, చల్లబడిన వాతావరణం ఆక్వా సాగుకు ప్రతికూలంగా మారింది. ట్రంప్ సుంకాల దెబ్బతో విలవిల్లాడుతున్న రొయ్య రైతులు ప్రస్తుత వాతావరణ మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో ఆదుకోవాల్సిన రొయ్యసాగు రైతును కుదేలు చేసింది. ఎడాపెడా తెగుళ్లు ఆశించడంతో రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. మరోవైపు చేప ధర తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల రొయ్యల ధర ట్రంప్ సుంకాల పెంపుతో పతనమయ్యాయి. చేప ధర కూడా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకూ పడిపోయింది. రెండు నెలలుగా వాతావరణం ఆక్వా సాగుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మే నెలలో అకాల వర్షాలతో పూర్తిగా చల్లబడగా, జూన్‌లో వాతావరణం వేసవిని తలపించింది. జూలైలో కూడా రెండు వారాల పాటు విపరీతమైన ఎండలు, ఉక్కబోతతో వేసవిని మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. పూటకో రకంగా మారుతున్న వాతావరణం వల్ల ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. చేపలు, రొయ్యలకు సరిపడ ఆక్సిజన్ అందకపోవడంతో నీటి ఉపరితలంపై తిరుగాడుతూ నీరసించిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం ఏరియేటర్లు తిప్పుతున్నారు.
తెగుళ్ల బారిన చేపలు, రొయ్యలు
చెరువులలో ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడి, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి చేపలు, రొయ్యలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు చేపలు, రొయ్యలు అర్ధంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50 లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాధులు, చేపలకు మొప్పతెగులు వంటివి సోకుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్య రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు ఉక్కిరిబిక్కిరి

ఆక్వాకు వాయు‘గండం’