
పెరుగుతున్న గోదావరి ఉధృతి
ఏలూరు(మెట్రో): గోదావరి వరద నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్‌లో 1800–233–1077, 94910 41419 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నదిలోకి వెళ్లడం గాని, ఈతకు వెళ్లడం గాని, చేపలు పట్టడం గాని చేయవద్దన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఈనెల 18న ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
తమ్మిలేరులో పెరుగుతున్న నీటిమట్టం
చింతలపూడి: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన తమ్మిలేరు జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఏలూరు జిల్లాలో వర్షాలకు తమ్మిలేరుకు వరద నీరు వచ్చి చేరింది. ప్రసుత్తం ఎగువ ఆంధ్రా కాల్వ ద్వారా గంటకు 579 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 339 అడుగుల మేర నీటి మట్టం ఉందని తమ్మిలేరు ఇరిగేషన్ ఇన్‌చార్జ్ ఏఈ లాజర్ బాబు ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. 348 అడుగులకు చేరుకోగానే అధికారులు కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు.
నిలిచిన రాకపోకలు
చాట్రాయి: తమ్మిలేరు వాగుకు వరద వచ్చినపడుల్లా రాకపోకలు నిచిపోతున్నాయి. మండలంలోని తమ్మిలేరు వాగు పరిధిలో కోటపాడు–చింతలపూడి మండలం పోతునూరు, చీపురుగూడెం–అగ్రహారం, మర్లపాలెం–యడవల్లి గ్రామాల మద్య తమ్మిలేరు వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో వాగుకి వరద వచ్చినపుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ గ్రామాల వారికి ఇరు వైపుల వ్యవసాయ భూములు ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. చీపురుగూడెం గ్రామస్తులకు చింతలపూడి కూత వేటు దూరంలో ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు, రకరకాల పనులకు చింతలపూడి వెళ్లాల్సిన పరిస్థితి. నాలుగు రోజల నుంచి వాగుకు వరద వస్తుండడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా తమ్మిలేరు వాగుపై వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
మళ్లీ గోదావరికి వరద
వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదారి వరద నీటిమట్టం 33 అడుగులకు పెరగడంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దుల వాగు వంతెన ఆదివారం నీట మునిగింది. దీంతో దిగువ ప్రాంతంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కోయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది, పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రెడ్డిగూడెం, యర్రమెట్ట, యడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఎద్దెల వాగు వద్ద అధికారులు నాటు పడవ ఏర్పాటు చేశారు.

పెరుగుతున్న గోదావరి ఉధృతి

పెరుగుతున్న గోదావరి ఉధృతి