
పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు
భీమవరం: రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్‌న్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు ఆరోపించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో టి.గంగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సులో మాట్లాడుతూ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.54 వేల కోట్లు వస్తుంటే కేవలం రూ.14 వేల కోట్ల రూపాయలతో పెన్షన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికుల్ని మోసం చేయడమేనని ఆయన వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ ఇతర సౌకర్యాన్ని ఆపాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు కనీసం రూ.9000 పెన్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నీరెత్తినట్టుగా ఉండడం పాలకుల విధానాలను తెలియజేస్తుందని ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే పాలకులు విస్మరించడం తగదని పేర్కొన్నారు. పెన్షనర్స్ సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ల వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 13న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.