
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల నుంచి ఈ అవార్డుకు 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఎంపికయ్యారని తెలిపారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నిబంధనలకు విరుద్ధంగా పెదవేగి మండలం రామచంద్రపురం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పెదవేగి పాఠశాలకు పంపిన ఎంఈఓ–1పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మోహన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రామచంద్రపురం పాఠశాలలో 100 మంది విద్యార్థులకు సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు(మెట్రో): రైతులకు ఎరువులు విక్రయించిన తరువాత ఆ వివరాలను ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అన్నారు. ఆదివారం జిల్లాలోని పెదవేగి, కామవరపుకోట మండలాల్లో ఎరువుల షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు రైతులకు యూరియా, ఇతర ఎరువులను విక్రయించిన తక్షణమే ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో రైతు ఆధార్ సహాయంతో ఈ–పోస్ నందు నమోదు చేయాలన్నారు. డీలర్లు ఎరువులను విక్రయించిన తర్వాత ఆ వివరాలను నమోదు చేయకపోవడం వల్ల జిల్లాకు ఎరువులు కేటాయింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పోర్టల్‌లో నమోదు చేయని పక్షంలో డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏలూరు(మెట్రో): జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ నెల 18న మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ పెండింగ్ పనులు, పౌరసరఫరాలు, సీ్త్ర శక్తి పథకం, గోదావరి వరద రిలీఫ్ ఆపరేషన్స్ తదితర అంశాలపై సమీక్షిస్తారు.