
శ్రీవారి భక్తులకు ‘సెల్’ కష్టాలు
ద్వారకాతిరుమల: దైవ దర్శనార్ధం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం సహజం. కానీ ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తమ సెల్‌ఫోన్‌లను డిపాజిట్ కౌంటర్‌లో భద్రపరచుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే కౌంటర్‌లో ఇచ్చిన ఫోన్‌లు భద్రంగా ఉన్నాయో లేదోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా తమ సెల్‌ఫోన్లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్‌లో అప్పగించాలి. భద్రపరచినందుకు ఒక్కో ఫోన్‌కు రూ.5 వసూలు చేస్తారు. శుక్రవారం వరకు ఒక కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నడిచిన ఈ కౌంటర్ నిర్వహణ బాధ్యతను, శనివారం నుంచి దేవస్థానమే స్వయంగా చేపట్టింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సిబ్బంది భక్తుల సెల్‌ఫోన్‌లను భద్రపరిచారు. ఇదిలా ఉంటే ఒక భక్తుడు తన రూ.1.50 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్ పగిలిపోయిందని, దానికి సమాధానం చెప్పాలని గొడవ చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు సెల్‌ఫోన్ తమ వద్ద డ్యామేజ్ కాలేదని చెప్పారు. దాంతో ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెల్‌ఫోన్ కౌంటర్ నిర్వహణకు రెండు నెలల క్రితం దేవస్థానం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక కాంట్రాక్టర్ ఏడాదికి రూ.కోటి 20 లక్షలు దేవస్థానానికి చెల్లించేలా పాటను దక్కించుకున్నాడు. కౌంటర్ ప్రారంభించకుండానే చేతులెత్తేశాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ పాట సమయంలో డిపాజిట్ చేసిన రూ.5 లక్షలను అధికారులు దేవస్థానం అకౌంట్‌కు జమ చేశారు. ఇదిలా ఉంటే మళ్లీ పాట నిర్వహించే వరకు కౌంటర్ నిర్వహణ బాధ్యతను చేబోలు రాజేష్ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతడు నష్టం వస్తోందని వదిలేశాడు. దాంతో భక్తుల సౌకర్యార్ధం, భద్రతా దృష్ట్యా ఆలయంలోకి సెల్‌ఫోన్‌లు అనుమతించ కూడదని దేవస్థానమే స్వయంగా ఈ సెల్‌ఫోన్లు భద్రపరిచే పనిని చేపట్టింది.
అనుభవం లేక.. సిబ్బంది చాలక
సెల్ ఫోన్ కౌంటర్ నిర్వహణలో దేవస్థానం సిబ్బందికి అనుభవం లేదు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సిబ్బంది కూడా చాల్లేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక కంప్యూటర్ మీదే టికెట్‌లు కొట్టారు. ఆ తరువాత రెండో కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమస్యల వల్ల భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి కంటే సెల్‌ఫోన్ భద్రపరచుకోవడానికే ఎక్కువ సమయం పట్టిందని భక్తులు వాపోయారు. కార్లలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ ఫోన్‌లను వారి వాహనాల్లోనే వదిలేశారు. బైక్‌లపై వచ్చిన వారు క్యూలైన్లలో నిలబడక తప్పలేదు.
సెల్‌ఫోన్‌లు భద్రపరిచేందుకు కౌంటర్ వద్ద క్యూ
గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి
కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దేవస్థానమే స్వయంగా చేపట్టిన వైనం
అనుభవం లేక.. సిబ్బంది చాలక సమస్యలు

శ్రీవారి భక్తులకు ‘సెల్’ కష్టాలు