
ఉద్యాన వర్సిటీ ఎంఓయూలు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మంగళవారం నాలుగు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. బయోప్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌స్, జినోమిక్స్ సీఎఆర్‌ఎల్ ప్రైవేట్ లిమిటెడ్, సిస్ ఇన్నోవా ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఎంఓయూ చేసుకున్నారు. ఉద్యానవన సాగు మొక్కల ఆరోగ్యం, పంట కోత తర్వాత సాంకేతికతను బలోపేతం, డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత ఉత్పత్తులు, ఇమేజ్ ప్రోసెసింగ్, నానో టెక్నాలజీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం, శాస్ల్రీయ పురోగతిలకుగాను ఈ ఒప్పందాలు జరిగాయి. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీసీ కె.గోపాల్, సంస్థల ప్రతినిధులు కేఎల్‌ఎన్.రెడ్డి, సి.యువరాజ్, డాక్టర్ రత్నగిరి పోలవరపు, జీయూ మహేష్ పాల్గొన్నారు.
రీసర్వే పనులు వేగవంతం
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు తెలిపారు. సచివాలయం నుంచి రీ సర్వే, అన్నదాత సుఖీభవ తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రీ సర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేస్తున్నామని, రైతుల నుంచి అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అక్రమంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ నాగమణి ఆదేశించారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి ఎంపీయూపీ స్కూల్‌లో పీఎస్‌హెచ్‌ఎంగా పని చేస్తున్న పొలమూరు వీరాంజనేయులు గతం జూన్ 7న తీసుకున్న రివర్షన్‌ను ఉన్నతాధికారులకు తెలపకుండా తిరిగి పదోన్నతి పొందారని, ఈ కారణంగా అతనిపై చర్యలు తీసుకోవాలని తణుకుకు చెందిన ఇందుగపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో వీరాంజనేయులుకు విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్‌జేడీకి కూడా ఫిర్యాదు చేయడంతో వీరాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
కొయ్యలగూడెం: బయ్యనగూడెంలో మనస్తాపంతో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం యర్రంపేటకు చెందిన సంగనం పరిమళ (23), భర్త శ్రీరాములు ఆరు నెలల క్రితం బయ్యనగూడెం వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలోకి కూరగాయలు కోయడానికి కూలి పనులకు వెళ్లారు. కూలి సరిపోవడం లేదని పెంచాలని పరిమళ మేస్త్రిని, రైతును అడిగినా ఒప్పుకోలేదు. ఈ విషయం భర్తకు చెప్పగా ఇష్టమైతే పనికి వెళ్లు.. లేకపోతే మానేమని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన పరిమళ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.