
కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు
ఏలూరు (టూటౌన్): అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు ఖండ్రిగగూడెంలోని సుఖీభవ కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హమీలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల మధ్య సామాజిక వర్గాల పేరుతో గొడవలు సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గద్దె నెక్కి అవసరం తీరాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
నిరుద్యోగ భృతి ఎక్కడ?
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడంతో పాటు ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారన్నారు. ఎస్సీలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని నిజంగా టీడీపీకి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గం ఇన్‌చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్, దెందులూరు ఇన్‌చార్జ్ కొఠారు అబ్బయ్య చౌదరి, పోలవరం ఇన్‌చార్జి తెల్లం బాలరాజు, చింతలపూడి ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు అందజేస్తామని, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ప్రకటించిందని, అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా ఇంత వరకు వాటి ఊసే లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో నిత్యం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగనన్న దళిత ఫోర్స్‌ను ప్రారంభించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధులు మున్నుల జాన్ గురునాథం, ఇంజేటి నీలిమ, కత్తుల రవికుమార్, మోటార్ ఏసుబాబు, జెడ్పీటీసీలు నిట్టా నీలా నవకాంతం, నీరజ, ఏలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, కై కలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు దున్న బేబీ, ఎస్సీ సెల్ నాయుకులు నిట్టా గంగరాజు, పల్లెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో నేతల మండిపాటు
కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: డీఎన్నార్

కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు