
రోడ్డు దాటుతూ.. ఇద్దరు మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం. కామవరపుకోట మండలం నారాయణపురంనకు చెందిన పలగాని శ్రీరామమూర్తి(36) మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు నిమిత్తం తన స్నేహితుడితో కలసి సోమవారం రాత్రి దూబచర్లకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీనగర్ వద్ద కారు దిగి, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి రోడ్డు దాటుతుండగా, రాంగ్ రూట్‌లో కప్పలకుంట వైపు నుంచి వేగంగా వెళుతున్న ఒక లారీ శ్రీరామమూర్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని స్నేహితుడు హుటాహుటీన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదుపై ద్వారకాతిరుమల ఏఎస్సై అమీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలాగే లైన్ గోపాలపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం హైవే సిబ్బంది మృత దేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.