విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి
భీమవరం: కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతు జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయని చట్టం ప్రకారం ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ద్వారా మాత్రమే చదువు చెప్పాలనే నిబంధనలున్నా.. ప్రైవేటు పాఠశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి వేలకు వేలు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పుస్తకాలు, దుస్తులు విక్రయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు కొన్ని ప్రాంతాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, కె.గోవింద్, ఎన్.సాయి ఫణికుమార్, కె.రోహిత్, పి.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


