బాలలచే పని చేయించడం నేరం
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): బాలలచే పనిచేయించడం నేరం అని, వారిని పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశపు మందిరం నందు కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టానికి సంబంధించిన అవగాహన గోడ పత్రికలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 18 సంవత్సరాల లోపు బాలలచే పని చేయించడం చట్టప్రకారం నేరమన్నారు. బాల కార్మికుల గురించి ఫిర్యాదులకు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098ని సంప్రదించవచ్చునన్నారు. బాల కార్మికులను గుర్తించేందుకు ఈనెల 10వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశంచారు. బడి బయటి పిల్లలను గుర్తించడంతో పాటు వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే కాకుండా క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా విద్యా శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ బాల కార్మికులచే పని చేయించిన వారికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధించబడుతుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.


