కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 5 వేల నీటి కుంటల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటివరకూ 2,389 పనులు మంజూరు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన నీటి కుంటల నిర్మాణాలను జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నీటి కుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా 850 గోకులం షెడ్డులు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తయి మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. పంచాయితీరాజ్ ద్వారా ఇప్పటివరకూ 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, డీపీఓ కె.అనురాధ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఎంవీ రమణమూర్తి పాల్గొన్నారు.