నూజివీడు: పట్టణంలోని ఢంఢం గార్డెన్ ప్రాంతానికి చెందిన వివాహిత బొర్రా హారిక ప్రియ(20) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మృతురాలి తల్లి చలమాల ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఒకటో పట్టణ ఎస్సై కే.శివనారాయణ తెలిపిన వివరాల ప్రకారం హారికప్రియ కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. హారికప్రియకు తన ఆడబిడ్డ కొడుకై న బొర్రా సర్వేశ్వరరావుతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరిద్దరికి ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు కూడా ఉన్నాడు. సర్వేశ్వరరావు తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరి సోమవారం ఉదయం పనికి వెళ్లాడు. వర్షం వల్ల తిరిగి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా హారికప్రియ దూలానికి ఉరివేసుకొని ఉంది. వెంటనే ఇంటిపక్కనే ఉండే వారిని పిలిచి తలుపు పగులగొట్టి హారికప్రియను కిందకు దించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 11 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


