బాబుగారి మూడు ముచ్చట్లు

Vardhelli Murali Article on Chandrababu Naidu Politics in AP - Sakshi

జనతంత్రం

అదొక యెల్లో ప్రపంచం. కల్లబొల్లి కథాసరిత్సాగరం. ముక్కు మూసుకొని అందులో ఓ మునకేసి చూడాలి. అక్కడ మూడు కాళ్ల కుందేళ్లు మనకు కనబడతాయి. ఎగిరే గుర్రాలు దర్శన మిస్తాయి. ఊళపెట్టే ఏనుగులు, ఘీంకరించే నక్కలూ అక్కడ సంచరిస్తూంటాయి. మైకులూ, పెన్నులూ కదను దొక్కు తాయిచట. ఇక్కడి రచయితలంతా హఠయోగ సాధకులు. నాలు కల్ని నాలుగు మడతలు వేయగల ఖేచరీ విద్యాపారంగతులు. తప్పుడు ప్రచారాలకు తాతపాదులవారైన గోబెల్స్‌కు అబ్బ వంటి బాబెల్స్‌ సైనికులు వీరంతా!

ఆంధ్రప్రదేశ్‌ సమాచార వాతావరణంలోకి యెల్లో సిండికేట్‌ కాలుష్యకారక ఉద్గారాలను వెదజల్లడం కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడది శ్రుతి మించింది. యెల్లో సిండికేట్‌ అధినాయకుడు అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి క్రమంగా పెరుగుతున్న బొగ్గుపులుసు వాయువుల విడుదల ఇప్పుడు పీక్స్‌కు చేరింది. ఇంకో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సిండికేట్‌ అప్రమత్తమవుతున్నది. కెమికల్‌ వెపన్స్‌కు సాన బెట్టుకుంటున్నది. యెల్లో కూటమి బాసూ, దాని పొలిటికల్‌ ఫేసూ అయిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తమ రాజకీయ ఎజెండాకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. 

ముచ్చటగా మూడంశాలు ఎల్లో కూటమి రాజకీయ ఎజెండాలో భాగం కానున్నాయి. ఆ మూడు ముచ్చట్లనూ చంద్రబాబు జనంతో పంచుకున్నారు. ఇందులో ఒకటి తమ ప్రచార శైలికి సంబంధించినది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి తాము ఏ స్థాయిలో తప్పుడు ప్రచారాలకు ఒడిగట్టగలమనే విషయాన్ని తెలియజెప్పడానికి ఒక మచ్చు తునకను విడుదల చేశారు. ఈ జలక్‌ను ఆయన శ్రీకాకుళం జిల్లాలో వదిలారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలని తాను బలంగా కోరుకుంటున్నది ఎందుకనే మనసులోని మాటను ఎంపిక చేసుకున్న కొంతమందితో పంచుకున్నారు. ఇది విశాఖ జిల్లాలో జరిగింది. తప్పుడు ప్రచారాలతో కూడిన మారణాయుధాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఒంటరిగా తాను వైఎస్‌ జగన్‌ను ఓడించలేనని బహిరంగంగా అంగీకరించారు. మిగిలిన పార్టీలన్నీ తన వెంట రావాలనీ, తనకు అండగా నిలవాలనీ అభ్యర్థించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

ఎజెండాలోని మూడంశాల్లో మొదటిది – విషప్రచారం. ఆయన శ్రీకాకుళంలో వదిలిన వాగ్బాణాన్ని చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం వలన ప్రపంచానికి కరోనా సోకిందట! ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు గానీ, ఉద్దండులైన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గానీ తేల్చలేని శాస్త్రీయ సమస్యను చంద్రబాబు చిటికెలో తేల్చి పారేశారు. అయితే ఆ కరోనాను ముందుగా చైనాలోనే ఎందుకు జొప్పించారో, తన రాజకీయ ప్రత్యర్థులపైకి ఎందుకు పంపించ లేదో? వగైరా సందేహాలను మాత్రం చంద్రబాబు నివృత్తి చేయలేదు. వచ్చే రెండేళ్లపాటు ఈ తరహా ప్రచారాన్ని ఊదర గొట్టేందుకు యెల్లో కూటమి సిద్ధమైందని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడాని కంటే ముందుగానే యెల్లో మీడియా దానికి పూర్వ రంగాన్ని ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా మారింది. అందులో భాగంగా అనేక కథనాలను అది ప్రచారంలో పెట్టింది. ద్రవ్యో ల్బణం ఫలితంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమనే భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది.

శ్రీలంక సంక్షోభానికీ, ఆంధ్రప్రదేశ్‌కూ కలిపి మోకాలూ – బోడిగుండు సిద్ధాంతాన్ని అన్వయించే ప్రయత్నం చేసింది. పెట్రోల్‌ ధరలు పెరగడంలో కేంద్రం బాధ్యత లేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే వేసింది. ఇలాంటి కథనాలను రోజుకో పది చొప్పున ఎల్లో మీడియా ఎక్కుపెట్టడం ప్రారంభించి చాలా రోజులైంది. దాని కొనసాగింపే – కరోనాకూ, జగన్‌మోహన్‌ రెడ్డికీ లంకె పెట్టడం! రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌ యుద్ధానికీ, భూగ్రహ ఉష్ణ తాపోన్నతికీ, మండుతున్న ఎండలకూ జగన్‌ మోహన్‌రెడ్డి కారణమనే వార్తలు వచ్చినా రావచ్చు.

రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనీ, అప్పు పుట్టడం లేదనీ, నేడో రేపో సర్కార్‌ మునిగిపోబోతున్నదనీ కథనాలు లేని రోజు యెల్లో మీడియా తాజా చరిత్రలో లేనేలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో యెల్లో మీడియా అచ్చేసిన ఓ కథనాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కార్‌కు ఖాళీ ఖజానా స్వాగతం చెబుతున్నదనీ, వందకోట్లకు మించి నిల్వలు లేవనీ, జీతాలు చెల్లించడం సైతం కష్టం కానున్నదనీ స్వయంగా యెల్లో మీడియానే రాసింది. కేవలం వందకోట్ల రొక్కంతో ఆదిలోనే ఎదురైన ఆర్థిక మందగమన పరిస్థితులను ఈ ప్రభుత్వం విజయవంతంగా ఎదురీదగలిగిందని సదరు మీడియా ఎప్పుడూ రాయలేదు.

ఒకపక్క కరోనాను ఎదుర్కొంటూనే, దేశానికే తలమానికమైన ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేసిన వైనాన్ని గురించి యెల్లో మీడియా చర్చించనేలేదు. కేవలం వందకోట్ల నిధులతోనే నడక ప్రారం భించిన జగన్‌ ప్రభుత్వం మూడేళ్లు తిరిగేసరికి ఒక లక్షా నలభైవేల కోట్ల నగదును జనం చేతుల్లో పెట్టగలిగిన విజయగాథను ఒక్కసారైనా ప్రస్తావించనే లేదు. ఆ ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం కారణంగా ఆంధ్ర రాష్ట్రం సంక్షో భంలో పడకుండా ఆర్థిక గతిశీలతను నిలబెట్టుకోగలిగిందనీ, జీఎస్‌డీపీని వృద్ధి చేసుకున్నదనీ, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయనీ ఏనాడూ యెల్లో మీడియా గుర్తించలేదు.

వందకోట్ల నగదుతోనే ముందడుగు వేసిన జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికే ఆయువుపట్టు లాంటి ఆర్‌బీకే వ్యవస్థను రూపుదిద్దిందనీ, ఈ ఘనత ఐక్యరాజ్యసమితి వేదికను ఎక్కబోతున్నదనే సమా చారంపై కూడా యెల్లో మీడియా ముసుగు కప్పే ప్రయత్నం చేసింది. విద్యారంగంలో ప్రారంభమైన విప్లవాత్మక సంస్కర ణలను కూడా అది గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తుందని యెల్లోమీడియా మీద ఒక విమర్శ కూడా ఉండేది. ఇప్పుడైతే అదీ లేదు. చలామణీలో ఉన్న నాణేనికి బదులు నకిలీ నాణేన్ని చూపెట్టడం మొదలుపెట్టింది. ఈ పదేళ్లలో యెల్లో మీడియా సాధించిన అభివృద్ధి అది. నకిలీ నాణెం కథలతోనే వచ్చే ఎన్నికలను చంద్రబాబు ఎదుర్కో బోతున్నట్టు కరోనా ఉపాఖ్యానం ద్వారా ఆయన స్వయంగా వెల్లడించినట్లయింది.

ఇక రెండోది తన ఐడియాలజీకి సంబంధించిన ప్రకటన! విశాఖ జిల్లా భీమ్లి నియోజకవర్గంలో ఆయన తన మనసులో మాటను వెల్లడి చేశారు. పూర్వకాలంలో పేదవారి చదువుల పట్ల గ్రామ మోతుబరులు ఎలా స్పందించేవారో ఇప్పటి వయోధికులు కొందరికి గుర్తుండే ఉంటుంది. స్వయంగా చూడనివాళ్లు సినిమాల్లోనో, నాటకాల్లోనో ఇటువంటి దృశ్యా లను చూసే ఉంటారు. నవలల్లో చదివి ఉంటారు. బంగళా చావిట్లో ఒక చెక్క కుర్చీలో మోతుబరి కూర్చొని ఉంటాడు. ఎదురుగా పాలేరు నిలబడి ఉంటాడు.

అతడితోపాటు ఆరేడేళ్ల కొడుకు. పాలేరేదో చెబుతాడు మోతుబరితో! పెద్దాయన వెంటనే స్పందించడు. లంక పొగాకు చుట్టను గట్టిగా రెండు దమ్ములు లాగి ఆ పారవశ్యాన్ని కాస్సేపు కళ్లు మూసుకొని అనుభూతి చెందుతాడు. ఆ తర్వాత నెమ్మదిగా పాలేరు వంక చూస్తాడు. ‘ఒరేయ్‌ అబ్బులూ! పిల్లోడేదో తెలిసీ తెలియక బడికెళ్తానన్నాడే అనుకో... నీ బుద్ధి ఏమైందిరా? వాడిప్పుడు బడికెళ్లి ఉద్యోగాలు చేస్తాడా, ఊళ్లేలుతాడా? ఎటూ పనికి రాకుండా పోతాడు. పనిలో పెట్టావనుకో... నీకూ భారం కొంచెం దిగుద్ది. వాడికీ బతుకు బరువు తెలిసొస్తది. వెళ్లు! రేపట్నించి మన దగ్గరే పనిలో పెట్టు’... సబ్జెక్టును ఆ విధంగా మోతుబరి ముగిస్తాడు.

సరిగ్గా ఇటువంటి దృశ్యమే విశాఖ జిల్లాలో కొద్దిగా కాలానుగుణమైన మార్పులతో ఆవిష్కృతమైంది. భీమ్లి నియోజకవర్గం తాళ్లవలస సమీపంలోని ఒక ధాబా దగ్గర చంద్రబాబు కొన్ని పేద కుటుంబాలతో మాటామంతీ నడిపారు. తమవారిగా భావించి ఎంపిక చేసుకున్నవారినే అక్కడికి తీసుకొచ్చారు. బాబుగారు నెమ్మదిగా ప్రారంభించారు. ‘‘ఆయన (వైఎస్‌ జగన్‌) ఏదో ‘నాడు–నేడు’ అంటున్నాడు. ఇంగ్లిష్‌ మీడియం అంటున్నాడు. ఇంగ్లిష్‌ మీడియం అంటే ఏమైంది! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది. ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారైతారు...’’. ఆ మాటల ప్రవాహం అలాగే సాగివుంటే మరిన్ని ఆణిముత్యాలు బయటపడేవి. కానీ, తన వారనుకున్న జనమే అడ్డుతగిలి ‘జై జగన్‌’ అనే నినాదాలు చేయడంతో చంద్రబాబు ఖంగుతిన్నారు.

జరిగిన సంఘటన విషయాన్ని పక్కన పెడితే ఈ సన్నివేశం చంద్రబాబు భావజాలాన్ని, ఆయన మనసులో మాటను మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఆయన పేద ప్రజల ఎంపవర్‌మెంట్‌కు బద్ధవ్యతిరేకి అన్న విషయం నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. ‘నాడు–నేడు’ పేరుతో సర్కారు బళ్లను ఆధునికీకరిస్తే పేద పిల్లలూ, పెద్దవారి పిల్లలూ పక్కపక్కనే కలిసి కూర్చొని చదువుకుంటారు. ఇది ఆయనకు అవాంఛనీయమైన సమానత్వం కాబోలు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే పేదపిల్లలు పెద్ద ఉద్యోగాలకు వెళ్లగలుగుతారు. ఇక్కడుండే నయా మోతుబర్లకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు దొరకరు. పాత కాలపు మోతుబరి మైండ్‌సెట్‌కూ, బాబుగారి ప్రవచనాల వెనకనున్న మైండ్‌సెట్‌కూ పెద్ద తేడా ఏమీ లేదు.

ఈ ఒక్క సంఘటన ఆధారంగా చంద్రబాబు భావజాలంపై నిర్ధారణకు రావడం లేదు. ఇటువంటి అనేక ఉదంతాల అనంతరమే, అనేక ప్రవచనాల అనంతరమే ఆయనను పేద ప్రజల ఎంపవర్‌మెంట్‌కు వ్యతిరేకిగా, మహిళా ఎంపవర్‌ మెంట్‌కు వ్యతిరేకిగా భావించవలసి వస్తున్నది. ఎస్‌.సి. కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని కామెంట్‌ చేయడం వెనుక ఇటువంటి భావజాలమే దాగి ఉన్నది. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అనే పురుషా హంకార సూక్తి వెనుక ఇదే భావజాలం దాగి ఉన్నది.

తోకలు కత్తిరిస్తానని నాయీ బ్రాహ్మణులను, మత్స్యకారులను బెదిరిం చడం వెనుక ఉన్నది కూడా ఈ తరహా ఐడియాలజీయే! బీసీ న్యాయవాదులు జడ్జీ పదవులకు అనర్హులంటూ కేంద్రానికి లేఖలు రాయడం వెనకనున్న గూడుపుఠాణీ కూడా ఈ భావజాల ఫలితమే! తన కార్మికవర్గ వ్యతిరేకతనూ, రైతు వ్యతిరేకతనూ ఏమాత్రం దాచుకోకుండా రెండు దశాబ్దాల క్రితమే ఆయన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని అచ్చేసు కున్నారు.

ఇక మూడవ ముచ్చట – రాజకీయ పొత్తుల కథ! చంద్ర బాబు భావజాలానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తి విరుద్ధం. పేద ప్రజల, మహిళల ఎంపవర్‌మెంట్‌కు దోహదకారిగానే కాదు, చోదకశక్తిగా, ఇంజన్‌గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కేవలం గోబెల్స్‌ ప్రచారం ద్వారా మాత్రమే ఇటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం సాధ్యం కాదనే సంగతి ఆయనకు అర్థమైంది. సొంతవారనుకుని పిలుచుకున్న వారే ‘జై జగన్‌’ అనేసరికి తత్వం బోధపడింది. అక్కడి నుంచి కాకినాడకు వెళ్లేసరికి పొత్తుల పాట అందుకున్నారు. ఇంతకాలం తానూ, తన యెల్లో మీడియా ప్రచారం చేసిన ప్రజావ్యతిరేకత అనేది అబద్ధమని చంద్రబాబు పిలుపుతో తేటతెల్లమైంది. ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వం కనుకనే దానిని ఓడించడానికి రాజకీయ పార్టీలు, వ్యక్తులు, శక్తులూ అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిస్తున్నారు.

పొత్తులు చంద్రబాబుకు కొత్త కాదు. అవే ఆయన ఆశ, అవే ఆయన శ్వాస! చంద్రగోళం స్వయం ప్రకాశకం కానట్టే చంద్రబాబు కూడా స్వయం ప్రకాశకం కాదు. సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందితేనే చంద్రగోళం ప్రకాశిస్తుంది. అట్లాగే బాబు ప్రకాశం కూడా! ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి కిరణాల వెలుగులో ఒకసారి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ వెలుగుల సాయంతో మరోసారి గెలి చారు. అరువు కిరణాల పరావర్తనం జరగనప్పుడు ఆయన గెలవలేరు. ఇప్పుడున్న జనరంజక సర్కార్‌ను ఢీకొని గెలవడం కల్ల అని ఇప్పుడాయన అంగీకరించినట్టే! ఈ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నదని కూడా ఆయన అంగీకరించినట్టే! ఊహించినట్టుగానే ఆయన పొత్తుల పిలుపునకు రెండు పార్టీల నుంచి పాజిటివ్‌ స్పందన లభించింది.

ఒకటి బాబుగారి దత్తపుత్రుడిగా అధికార పార్టీ నేతలు పిలుచుకునే పవన్‌ కల్యాణ్‌ పార్టీ నుంచి! రెండోది నారాయణ – రామకృష్ణల పార్టీ నుంచి! రాజకీయ పార్టీల పొత్తుల మాట ఎలా ఉన్నా రాష్ట్రంలో సాధికారత కోరుకుంటున్న ప్రజలంతా ఒక గట్టు మీద సమీకృతమవుతున్నారు. ఈ గట్టున పేద ప్రజలు, మహిళల సాధికార సిద్ధాంతం ఉన్నది. అది పదే పదే ప్రభాతభేరీ మోగిస్తున్నది. మరో ప్రపంచపు కంచు నగారాను వినిపిస్తున్నది. ఆ గట్టున నయా పెత్తందార్లుంటారు. వారి ప్రయోజనాలుం టాయి. వారి మీడియా ఉంటుంది. ఆ మీడియాకు మ్యాజిక్‌ చేయడం తెలుసు. ఇప్పుడందరూ ఏదో ఒక గట్టుకు చేరాల్సిందే! మరో మార్గం లేదు. ఇదీ పోలరైజేషన్‌. రాజకీయ శక్తుల పునరేకీకరణ కాదు. కావలసింది ప్రజాశక్తుల పునరేకీకరణ! ఆ గట్టునుంటావా నాగన్న... ఈ గట్టుకొస్తావా?

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top