తోడేళ్ల మందతో తస్మాత్‌ జాగ్రత్త!

Vardelli Murali Article on Yellow media campaign AP Government - Sakshi

జనతంత్రం

వాడి పేరు మారీచుడైతేనేమి.. సుబాహుడైతే నేమి? ఆవిడ పేరు తాటకైతేనేమి... శూర్పణఖ అయితేనేమి? అందరూ దైత్యులే! రావణభృత్యులే! అతడు రామోజీ అయితేనేమి... చంద్ర బాబు అయితేనేమి? ఆ గొట్టాలు ఏబీఎన్‌ అయి తేమీ, టీవీ5 అయితేమీ? ఈ వ్యవస్థలో మొలకెత్తిన విషపు విత్తులే! పెత్తందారీ వ్యవస్థ తొత్తులే! తోడేళ్ల   గుంపును అదుపులో పెట్టుకొని వాటి వికృతమైన, భయంకరమైన అరుపులతో సమాజంపై పెత్తనం చేయడానికి అల వాటుపడిన కూటమి ఇది.

లోక కల్యాణార్థం అలనాటి రుషులు తలపెట్టిన యజ్ఞ యాగాదులను రాకాసి మూకలు ఏనాడూ సహించలేదు. యజ్ఞ వాటికలపై నెత్తురు గుమ్మరించి మాంసం ముద్దలను విసిరి భగ్నం చేసేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనుషుల సుఖసంతోషాలు రాక్షసగణ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక. ఇప్పుడూ అదే జరుగు తున్నది. అడవి లోని తోడేళ్లు మనిషిని పెంచుకుంటే వాడు మోగ్లీ (జంగిల్‌బుక్‌) అవుతాడు. కానీ పెత్తందార్లు తోడేళ్లను తయారు చేసుకొని పోషిస్తే అవి రాక్షసత్వం సంతరించుకుంటాయి. మేఘనాథ,  కుంభ కర్ణ, అతి కాయ, ప్రహస్త వంటి రావణ సేనాపతులవుతారు. 

ఎంతోదూరం వెళ్లడం దేనికి? గడిచిన వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న§ ó మిటి? తోడేళ్ల గుంపు మొరుగుతున్న దేమిటి? వచ్చేనెల మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విశాఖలో జరగబోతున్నది. ఇందుకు సన్నాహకంగా ఢిల్లీలో జరిగిన భేటీకి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఏకంగా 48 దేశాల రాయబారులు, ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొనడం ఒక విశేషం. కోవిడ్‌ సంక్షోభాన్ని అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న మాంద్యం పరిస్థి తులను ఎదిరించి తమ రాష్ట్రం 11.48 శాతం ఆర్థిక వృద్ధిని ఎలా నమోదు చేసిందో, దేశంలోనే అగ్రస్థానంలో ఎలా నిలబడిందో వివరిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ప్రతినిధులను ఆకట్టుకున్నది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా తమ రాష్ట్రం ఎలా ముందువరసలో కొనసాగుతున్నదో కూడా ఆయన వివరించారు. రాజకీయ నాయకుడి మాటల్లోని నిజాయితీని అంచనా వేయడంలో వ్యాపార వేత్తల కంటే నిపుణులైన వారు ఎవరూ ఉండరు. అందుకే గతంలోనే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని బహిరంగంగా మెచ్చుకున్నవారిలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, డిక్సన్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ శర్మ, సెంచురీ ప్లైవుడ్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంకా తదితరులున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కియా, టోరే, క్యాడ్బరీస్, సెయింట్‌ గోబియాన్, అపాచీ – హిల్‌టాప్, ఎవర్టన్‌ టీ ఇండియా వగైరా కంపెనీల ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని కొనియాడారు. అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సుమంత్‌ సిన్హా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌మోహన్‌ రెడ్డే పెద్ద ఆస్తిగా అభివర్ణించారు. భారత్‌ బయోటెక్‌ కో– ఫౌండర్‌ సుచిత్ర ఎల్లా కూడా సీఎంని ప్రశంసించారు.

మొన్నటి యూనియన్‌ బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన అనేక కార్యక్రమాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతుండటం ఒక విశేషం. చిరు ధాన్యాల ప్రోత్సాహానికి బడ్జెట్‌లో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించారు. ఈ తరహా మిల్లెట్‌ (చిరుధాన్యాలు) పాలసీ ఆంధ్ర ప్రదేశ్‌లో అమలవుతున్నది. ‘పీఎం మత్స్య సమృద్ధి యోజన’ పథకానికి కూడా అడుగుజాడ ఆంధ్రప్రదేశ్‌దే. రాష్ట్రం ఇప్పటికే 26 ఆక్వా హబ్‌లు, 14 వేల అవుట్‌లెట్ల ఏర్పాటుకు అడుగులేస్తున్నది. ప్రతి పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు లక్ష్యాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో 30 స్కిల్‌ హబ్స్, 26 స్కిల్‌ కాలేజీలు, రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్న బడ్జెట్‌ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్య క్రమమే ప్రేరణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కదా విజినరీ లక్షణం. మరికొన్ని రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ తన ఆలోచనలేనని మన ఎల్లో విజినరీ ప్రకటించుకున్నా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు.

ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రకటిం చింది. ఈ కార్యక్రమానికి కూడా స్ఫూర్తి ఆంధ్రప్రదేశే కావడం మరో విశేషం. ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో ఏడు లక్షల మంది రైతులు ప్రకృతి సాగును అనుసరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణా నిపుణుడు నిక్‌ వుజిసిక్‌ గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు. కాళ్లూ చేతులూ లేకుండా పుట్టిన తనను లోకమంతా చిన్నచూపు చూసినా చలించకుండా తనను తాను ఒక అద్భుతమైన ఆయుధంగా మలుచుకున్న ధీరుడు. తన జీవిత కథను దీపంగా మలిచి ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకుల మనసుల్లోని చీకట్లను పారద్రోలుతున్న వ్యక్తిత్వ నిపుణుడు. దేశాటనలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను చూసి ఆయన చకితుడయ్యారు. పాఠశాల నిర్వహణ మీద ప్రభుత్వాలు ఇంత శ్రద్ధ పెట్టడాన్ని తాను మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. చెప్పడమేకాదు స్వయంగా సీఎంని కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసే ఇన్ని పరిణామాలు గడిచిన ఒక్క వారంలోనే చోటుచేసుకున్నప్పటికీ ఇవి మన ఎల్లో మీడియాకుగానీ, దాని వెనకనున్న తోడేళ్లకు గానీ ససేమిరా కనిపించవు. వాళ్లు చూడరు. లోకాన్ని చూడనివ్వరు. లోకం చూడకుండా ఉండటానికి వాళ్ల దగ్గర కొన్ని నైపు ణ్యాలున్నాయి. మధుబాబు డిటెక్టివ్‌ నవలల్లోంచి, చందమామ భేతాళ కథల్లోంచి, పేదరాశి పెద్దమ్మ కథల్లోంచి కొన్ని ఘట్టాలను లేపేసి వాటికి తాజా రంగులద్ది వార్తలుగా ప్రచారంలో పెడతారు. ఈవారం కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి లభించిన మెచ్చుకోళ్లను పూర్వ పక్షం చేయడానికి కుళ్లిన కోడిగుడ్డు వాసన వెదజల్లే హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌తో వండి వార్చిన కొన్ని కథలను ఎల్లో మీడియా జనంలోకి వదిలింది.

ఎల్లో మీడియాకూ, సీబీఐ దర్యాప్తు సంస్థకూ మధ్యన ‘ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో’ అనే అనుమానం ఎవరికైనా వస్తే తప్పుపట్టలేము. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని అప్పటి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ భాగస్వాములుగా చేరి జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయ కేసులు బనాయించి సీబీఐ దర్యాప్తు వేయించిన దరిమిలా జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు కారణాలు. ఆనాడు దర్యాప్తు అధికారుల మనసులో మాటేమిటో ఎల్లో మీడి యాకు క్షణాల్లో తెలిసిపోయేది. ఎల్లో మీడియా ఏ కవిత్వం రాసినా దర్యాప్తు సంస్థకు అభ్యంత రాలుండేవి కాదు. అంతటి దృఢమైన బంధం ఇప్పుడైతే ఉన్నదో లేదో తెలియదు కానీ, ఎల్లో మీడియా కవిత్వం మాత్రం ఆగడం లేదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమ యంలోనే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గుర య్యారు. ఈ విషయం వివేకానందరెడ్డి బావమరిది ఫోన్‌ చేసి చెబితే అవినాశ్‌రెడ్డికి తెలిసింది. జమ్మల మడుగు ప్రయాణంలో ఉన్న అవినాశ్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది మీడియా ద్వారా అందరికీ తెలిసిన సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ సమాచారం చెప్పడానికి సహజంగానే ఆయన ఫోన్లు చేసి ఉండవచ్చు. చనిపోయిన వివేకానందరెడ్డి స్వయాన జగన్‌ మోహన్‌రెడ్డి బాబాయ్‌ కనుక ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించడంలో విశేషమేమున్నది. ఆ ఫోన్‌ను ఇంట్లో అటెండరో, మరొకరో రిసీవ్‌ చేసుకుంటే వింతేమున్నది? 

ఇందులో కుట్రకోణం గానీ, కుంభకోణం గానీ ఎక్కడున్నది? అటువంటి లంబకోణం ఏదైనా వుంటే అప్పుడున్న తెలుగు దేశం ప్రభుత్వం ఎందుకని ఉచ్చు బిగించలేదు. మృతదేహం దగ్గర దొరికిన లేఖను దాచిపెట్టమని వివేకా అల్లుడు మృతుని పీఏని ఎందుకు ఆదేశించాడు? వెంటనే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? ఇలా ఇవ్వకూడదనే సలహా ఆయనకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ కదా దర్యాప్తు ప్రారంభం కావలసింది. హత్యలో తమ పార్టీవారి ప్రమేయం ఉన్నందువల్ల వారిని తప్పించడం మీదనే దృష్టిపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం దర్యా ప్తును తాత్సారం చేసిందా? ఇప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రతిష్ఠతో కడుపు మండి కాకమ్మ కథలతో చెలరేగుతున్నారా? విచారణ కోసం, సమాచారం కోసం సీబీఐ నోటీసులు ఇస్తే ఎవరైనా వెళ్తారు. తమకు తెలిసిన సంగతులు చెప్తారు. దీన్ని ఆసరా చేసుకొని వీవీఐపీ కుటుంబం మీద బురద జల్లడానికి బరితెగిస్తారా?

వైసీపీ నాయకుడు కొడాలి నాని చేసిన డిమాండ్‌కు ప్రజాస్వామ్య ప్రేమికులందరూ మద్దతు పలకవలసి వస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం తన సోదరుడైన చంద్రబాబు మీద విమర్శలు చేసిన తర్వాత నారా రామ్మూర్తి నాయుడు ప్రజల్లో కనిపించడం లేదట! రామ్మూర్తి నాయుడు ఒక దఫా శాసన సభ్యుడిగా కూడా పనిచేశారు. కనుక ఆయన ఉనికిని, బాగోగులను తెలుసుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉన్నది. అట్లాగే ఎన్టీఆర్‌ మరణంపై తనకు అనుమానాలున్నాయనీ, విచారణ జరిపించాలనీ ఆనాడే హరికృష్ణ కోరినట్టు కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ మరణం వల్ల ప్రధానంగా లబ్ధి జరిగింది చంద్రబాబుకే కనుక ఆయన విచారణకు అంగీకరించలేదని కూడా నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఎనిమిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, అగ్రశ్రేణి కళాకారుడైన ఎన్టీ రామారావు మృతిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికైనా విచారణ జరగాల్సిందే. మకుటం లేని మహారాజులాగా వెలుగొందిన వ్యక్తి దయనీయ స్థితికి దిగ జారడానికి కారకులైన వ్యక్తులు ఎవ రెవరున్నారో లెక్క తేలవలసిందే. ఆలస్యమైనా సరే న్యాయం జరగవలసిందే.

తప్పుడు ప్రచార దుర్గంధాన్ని వెదజల్లడంలో భాగంగా కొన్ని పాచిపోయిన పాతకాలపు ఎత్తుగడలను కూడా ఆశ్రయిస్తున్నారు. అందులో ఒకటి వైసీపీ నుంచి వలసలు ప్రారంభ మయ్యాయనీ, చాలామంది బయటకు రాబోతున్నారనే ప్రచారం. సర్వేలు చెబుతున్నాయి తెలుగుదేశం గెలవ బోతున్నదని మరో ప్రచారం. ఎల్లో మీడియాకు పాఠకులు విజ్ఞప్తి చేయ వలసిన విషయం ఒకటున్నది – ‘2019 ఎన్నికలకు ముందు మీరు అచ్చేసిన సర్వే ఫలితాలను 
ముందుగా ప్రకటించండి. ఆ తర్వాత కొత్త సర్వేల గురించి రాయాల’ని డిమాండ్‌ చేయాలి.

పార్లమెంట్‌ ఎన్నికలకు ఓ రెండేళ్ల ముందే బీజేపీ తన ఎన్నికల కసరత్తును ప్రారంభిస్తుంది. తమ పార్టీ ఇమేజ్‌ పెరిగినట్టు నిరూపించడానికి కొన్ని సర్వే సంస్థలను (ట్రాక్‌ రికార్డ్‌ సరిగా లేని) రంగంలోకి దించుతుంది. ఇప్పుడా కాంట్రాక్టు ‘సీ వోటర్‌’ అనే సంస్థకు దక్కింది. బీజేపీ బలం చెక్కు చెదరలేదని చెప్పడం కోసం ఆ సంస్థ ప్రధానితో సహా బీజేపీ ముఖ్యమంత్రులందరి రేటింగ్‌ను పెంచేసింది. ఆమేరకు నాన్‌–బీజేపీ ముఖ్యమంత్రుల రేటింగ్‌ను కొంచెం తగ్గించేసింది. ఇంకేముంది మన కోతికి కొబ్బరికాయ దొరికింది. జగన్‌ మోహన్‌రెడ్డి రేటింగ్‌ తగ్గిందనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. నూటికి నూరుపాళ్లు సక్సెస్‌ రేటు ఉన్న అత్యంత విశ్వస నీయమైన ఒక సర్వే సంస్థ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఫలితాలు దాదాపు పునరావృతం కానున్నాయి. ప్రతి పక్షాల పొత్తుల వల్ల పాలక పార్టీకి నష్టం కంటే లాభమే ఎక్కువ జరుగుతుందని ఆ సంస్థ అభిప్రాయపడినట్టు సమాచారం. 

బహుశా అందువల్లనే ప్రతిపక్ష తోడేళ్ల మందను ముఖ్యమంత్రి పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు లేదు. ఆ ధీమాతోనే మొన్న ఒక సభలో సింహం–తోడేళ్ల ప్రస్తావన కూడా తెచ్చి ఉండొచ్చు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా నిత్యం ప్రజల్లో ఉండాలనీ, అలా ఎవరైనా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వడం కుదరదనే సందేశాన్ని ఇస్తున్నాడనీ ఎల్లో మీడియానే చాలాసార్లు రాసింది. టికెట్‌ లభించడం కష్టమని సెల్ఫ్‌ ఎసెస్‌మెంట్‌ ద్వారా నిర్ధారణకు వచ్చిన వాళ్లు కొందరు పక్క చూపులు చూడవచ్చు. అటువంటి వాళ్లను చేరదీసి టిక్కెట్‌ ఇస్తామనే హామీని తోడేళ్ల మంద ఇవ్వ వచ్చు. ఆ తోడేళ్లను నమ్మడానికి కొన్ని గొర్రెలు సిద్ధపడితే ఎవరేం చేయగలరు? చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న లోకేశ్‌బాబు పాదయాత్ర తుస్సు మన్నది. దాన్ని పైకి లేపడం తమ వల్ల కాదని ఎల్లో మీడియా పెద్దలు కూడా తేల్చేశారట. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమా లను మసకపరచడానికి రాక్షస యుద్ధానికి తోడేళ్ల మంద తెగించింది. ‘అక్క ఆరాటం తప్ప బావ బతికేది లేద’నే సామెత ఉండనే ఉన్నది. ఎన్ని కోట్ల అరచేతుల్ని అడ్డం పెడితే సూర్యకాంతి ఆగుతుంది? ఎన్ని అబద్ధాలను పోగేసి కప్పినా నిప్పులాంటి నిజం దాగుతుందా?

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top