మళ్లీ మతం మంటలు! | Sakshi
Sakshi News home page

మళ్లీ మతం మంటలు!

Published Thu, Aug 3 2023 3:06 AM

Sakshi Editorial On Religion Manipur Issue

విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది.

దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్‌ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్‌ పట్టణాలు అట్టుడికిపోయాయి.

ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి.

అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్‌ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్‌ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు.

ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్‌ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్‌వేర్‌ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్‌ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్‌ అంటుకుంది.

అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్‌ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్‌ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. 

దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది.

నూహ్‌ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్‌ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్‌ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు.

ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి.  

Advertisement
Advertisement