అరచేతిలో... ఆరోగ్యం?! | Sakshi
Sakshi News home page

అరచేతిలో... ఆరోగ్యం?!

Published Wed, Sep 29 2021 12:06 AM

Sakshi Editorial On Digital Health ID Card

ఒకరకంగా ఇది విప్లవాత్మక ఆలోచన. అసంఖ్యాక ప్రజానీకానికి అవసరమైన ఆరోగ్యదాయక ఆలోచన. పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యచికిత్సనూ, ఆరోగ్య సంరక్షణనూ అందుబాటులోకి తేవడా నికి సంపూర్ణంగా సాయపడితే... స్వాగతించదగ్గ ఆలోచన. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ గుర్తింపు కార్డు ఇచ్చే భారీ దేశవ్యాప్త ప్రయత్నానికి మోదీ సర్కారు సోమవారం శ్రీకారం చుట్టింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంలో ఎర్రకోట సాక్షిగా ప్రధాని ప్రకటించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌’లో ఇది భాగం. అప్పటి నుంచి 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ బృహత్‌ కార్యక్రమం ఇప్పుడిక దేశవ్యాప్తం కానుంది. అంటే, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డుల జాబితాలో మరో దేశవ్యాప్త గుర్తింపు కార్డు చేరనుంది. సంక్షేమం కోసమే అయినప్పటికీ, ప్రజలందరి సమాచారాన్నీ సర్కారు సేకరించి, డిజిటల్‌ మ్యాపింగ్‌ చేసేందుకు కొత్త వీలు చిక్కింది.

సమగ్ర డిజిటల్‌ ఆరోగ్యవ్యవస్థలో వ్యక్తులకు ఆరోగ్య ఐడీ కార్డులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల జాబితా, అలాగే ఆరోగ్య వసతుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నది కేంద్ర ఆలోచన. ఈ కొత్త ఆరోగ్య గుర్తింపు కార్డు కింద ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. జన్‌ధన్‌ ఖాతా, ఆధార్, మొబైల్‌ ఫోన్‌ (సంక్షిప్తంగా జామ్‌) – ఈ మూడింటì  అనుసంధానం, అలాగే సర్కారీ ఇతర డిజిటల్‌ ప్రయత్నాల వల్ల ఈ ‘జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌’ (ఎన్డీహెచ్‌ఎం)కు పునాదిగా ఆన్‌లైన్‌ వేదిక ఇట్టే దొరుకుతుందని సర్కారు భావిస్తోంది.

నగదు చెల్లింపుల్లో విప్లవం తెచ్చిన ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌’ (యూపీఐ) లానే, ఇక్కడ ‘యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేజ్‌’ (యూహెచ్‌ఐ) వాడతారట. డాక్టర్లు, ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు రోగుల గత రిపోర్ట్‌లను డిజిటల్‌గా నమోదు చేస్తాయి. దాంతో, రోగి ఐడీ కార్డుతో ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్ర, తీసుకున్న చికిత్స, అందుబాటులో ఉన్న సేవలు దేశవ్యాప్తంగా చిటికెలో తెలుస్తాయి. అందుకే, ఆరోగ్యరంగంలో ఉన్నవారందరికీ పని సులువయ్యే ఈ విధానం ఓ సరికొత్త విప్లవం. ప్రతి పౌరుడికీ  14 అంకెల డిజిటల్‌ ఆరోగ్య ఐడీ నంబర్‌ ఇస్తారు. అదే ఆ వ్యక్తి ఆరోగ్య ఖాతా నంబర్‌. ఈ ఆరోగ్య ఖాతాలో డిజిటల్‌గా అతని ఆరోగ్య చరిత్రంతా నమోదై ఉంటుంది. పాత రికార్డుల మోతబరువు తగ్గుతుంది. రోగి కొత్త ప్రాంతానికి, కొత్త డాక్టర్‌ వద్దకు వెళ్ళినా సరే సమా చారమంతా డిజిటల్‌గా మీట నొక్కితే అందుబాటులో ఉంటుంది. ఇలా ఈ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో సేకరించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా, భద్రంగా ఉంచుతామని ప్రభుత్వ హామీ.

ఆరోగ్యరంగంలో సాంకేతికవినియోగం ఇటీవల విస్తృతమైంది. కరోనా వేళ టెలీ మెడిసిన్‌ వసతి విస్తరించింది. ‘ఇ–సంజీవని’తో 125 కోట్ల రిమోట్‌ కన్సల్టేషన్లు జరిగాయని కేంద్రం లెక్క. వాటిలో ఏపీదే అగ్రస్థానం. ఇక, ‘ఆరోగ్యసేతు’ యాప్‌ లాంటివి కోవిడ్‌కు అడ్డుకట్టలో సహకరించడమూ తెలిసిందే. ఇప్పుడీ డిజిటల్‌ హెల్త్‌కార్డ్‌ మరో ముందంజ. నిజానికి, ఇది మరీ కొత్తదేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత జగన్మోహనరెడ్డి సర్కారు ఈ పని చాలాకాలంగా చేస్తోంది. ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో లబ్ధి పొందుతున్న దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కార్డులిచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరేసి డాక్టర్లను పెట్టింది. రాష్ట్రంలో మొబైల్‌ మెడికల్‌యూనిట్‌ ‘104’ సర్వీసుతో 700 దాకా వాహనాలు రోజూ కనీసం ఓ గ్రామానికెళ్ళి, అక్కడి ప్రజల ఆరోగ్యస్థితులు విచారించి, ఆ సమాచారం రికార్డు చేసే బృహత్‌ యజ్ఞం చేపట్టింది.

ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డున్నవారు ఇప్పటికే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, నెట్వర్క్‌ ఆసుపత్రికి వెళ్ళినా వారి ఆరోగ్యచరిత్ర మొత్తం వైద్యులకు అందుబాటులో ఉంటోంది. తాజా కేంద్ర ప్రయత్నంతో డేటా దేశమంతటా ఎక్కడైనా అందుబాటులోకి వస్తుందన్న మాట. వ్యక్తుల సమాచారం, మొబైల్‌ ఫోన్, ఆధార్‌ నంబర్‌ లాంటి వివరాల ఆధారంగా ఉచితంగా ఈ కొత్త హెల్త్‌ ఐడీ కార్డ్‌ సృష్టి జరగనుంది. ఆరోగ్య నిపుణుల చిట్టా (హెచ్‌పీఆర్‌), ఆరోగ్య వసతుల చిట్టాల (హెచ్‌ఎఫ్‌ఆర్‌) లాంటి యాప్‌లు పెడతారు. ఇలా దేశపౌరులందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం వల్ల రాష్ట్రాలలో ఆరోగ్య పథకాలను మెరుగ్గా ప్లాన్‌ చేయవచ్చు. దేనికి తగినట్టు దానికి నిధులు కేటాయించవచ్చు. వృథా ఖర్చు అరికట్టవచ్చనేది ప్రభుత్వ వాదన. అరచేతిలో ఆరోగ్యం లాంటి ఈ మాటలు వినడానికి బాగున్నాయి. కానీ, డిజిటల్‌ అక్షరాస్యత మాట దేవుడెరుగు, మామూలు అక్షరాస్యతే అందరికీ లేని దేశం మనది. పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా ఆర్థికంగానే కాదు అంతర్జాల వసతుల్లోనూ భారీ అంతరాలున్న చోట ఈ భగీరథ యత్నం ఏ మేరకు, ఎప్పటికి ఆచరణ సాధ్యమో!

దేశంలోని 135 కోట్ల మందికీ హెల్త్‌ కార్డులంటే సంకల్పశుద్ధి అవసరం. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపుకార్డన్న దశాబ్దకాల ఆధార్‌ ఆలోచనే నేటికీ సంపూర్ణ సాకారం కాలేదు. ఆధార్‌ నమోదులో, డేటా అక్రమ వాడకంలో ఎన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. ఈ కొత్త కార్డుకైనా ఆ లోపాలు లేకుండా చూడాలి. అది సర్కార్‌కు సవాలే. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు వ్యక్తుల ఆరోగ్య రికార్డులను అప్‌డేట్‌ చేసే సత్తా మన ఆస్పత్రులకు ఏ మేరకు ఉంది? చిత్తశుద్ధితో, లోపరహితంగా ఎప్పటికప్పుడు ఆ పని చేయించడం కష్టసాధ్యం. ఆ కష్టాలెలా ఉన్నా, ఈ కార్డులతో పాటు ప్రాథమిక ఆరోగ్య వసతులు, రోగులు– వైద్యులు – పడకల నిష్పత్తిపై కేంద్ర సర్కారు వారి దృష్టి పడితే మహద్భాగ్యం. 

 
Advertisement
 
Advertisement