అమెరికాతో మైత్రీబంధం 

Sakshi Editorial On America And India Relationship In Biden Government

విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అయిదు రోజుల పర్యటన కోసం సోమవారం అమెరికా చేరుకున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో ఇరు దేశాలమధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడిం దన్న అభిప్రాయం కలిగిన ప్రతిసారీ ఆయన భారత్‌ గురించో, ప్రధాని నరేంద్ర మోదీ గురించో ఏదో రకమైన దుర్వా్యఖ్య చేసి అయోమయం మిగిల్చేవారు. కేవలం మన విషయంలోనే కాదు...ప్రపంచ దేశాలన్నిటి పట్లా ఆయన ధోరణి అలాగే వుండేది. భారత్, అమెరికాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలతో ఇండో–పసిఫిక్‌ ప్రత్యేక కూటమి ఉండాలని అమెరికా ప్రతిపా దించి చాన్నాళ్లయింది. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడే ఈ ఆలోచన అమెరికాలో మొగ్గతొడిగింది. అది ట్రంప్‌ హయాంలో ఇంకాస్త విస్తృతమైంది. మొదట్లో ఎన్నో అవరోధాలు ఏర్పడి, దాదాపు మూలనబడిందనుకున్న ఆ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రూపం సంతరించుకుంటోంది. ట్రంప్‌ తీరుతెన్నులెలావున్నా, ఆ విషయంలో ఎంత అసంతృప్తివున్నా చైనా దూకుడు చూసి...దానితో పడుతున్న సమస్యలు నానాటికీ పెరగడం గమనించి మనతో పాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా ఇండో–పసిఫిక్‌ కూటమిపై ఆసక్తి ప్రదర్శించాయి. దక్షిణ కొరియా సైతం దీనిలో భాగస్వామిగా మారేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ కూటమి గురించి పాటుపడుతూనే ట్రంప్‌ అప్పుడప్పుడు అంతర్జాతీయ కూటములపై నిరాసక్తత కనబరి చేవారు. ఏనాటినుంచో వున్న నాటో కూటమిపైనే ఆయన ఎన్నో షరతులు విధించడం మొదలె ట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర దేశాల్లో ఒకరకమైన అనిశ్చితి ఆవహించడంలో వింతేమీ లేదు. కానీ జో బైడెన్‌ అధికారంలోకొచ్చాక ఇంటా, బయటా ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే జైశంకర్‌ అయిదు రోజుల విస్తృత పర్యటన సాధ్య మైంది. ట్రంప్‌ వల్ల ఎన్ని సమస్యలొచ్చినా ఆయనైతేనే ఇరుదేశాల సంబంధాలూ సవ్యంగా సాగుతాయన్న అభిప్రాయం మోదీతో సహా అందరికీ వుంది. అయితే బైడెన్‌ రావడం కూడా మంచి పరిణామమేనని ఇప్పుడు ప్రభుత్వంలోని వారంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన టీంలో వున్నవారిలో మెజారిటీ సభ్యులు గతంలో మనదేశంతో మంచి సంబంధాలున్న వారు. అందువల్లే కావొచ్చు... బైడెన్‌ వచ్చిన వెంటనే భారత్‌తో మరింత మైత్రీబంధం ఏర్పడ టానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ద్వైపాక్షిక రంగంలోనే కాక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయడానికి ఏమేం చేయాలో ఖరారు చేసుకున్నారు. 

జైశంకర్‌ చర్చించబోయే అంశాల్లో కేవలం ఇండో–పసిఫిక్‌ కూటమి ఒక్కటే కాదు...చాలా వున్నాయి. అందులో కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనడానికి అవసరమైన సహకారం ఒకటి. రెండో దశ కరోనా విరుచుకుపడిన మొదట్లో అమెరికా కొంత నిర్లిప్త ధోరణి ప్రదర్శిం చింది. అమెరికాలో వున్న ట్రంప్‌ అనుకూల భారత సంతతి పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిపడటంతో వెనువెంటనే సరిదిద్దుకుంది.  ఈమధ్య మన దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఎదురై అనేకమంది మృత్యువాతపడినప్పుడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి అవసర మైన ఉపకరణాలనూ, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లనూ అందజేసింది. జైశంకర్‌ తన పర్యటన  సంద ర్భంగా కరోనా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ లతో కూడా మాట్లాడతారు. ఈ వ్యాక్సిన్‌లు మన దేశానికి అందించడానికి పాటించదల్చుకున్న విధివిధానాలేమిటో ఆయన ప్రభుత్వంతో కూడా చర్చిస్తారు. తన దగ్గరున్న 8 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను అవసరమైన దేశాలకు అందజేస్తామని ఈమధ్యే అమెరికా ప్రకటించింది. మన దేశం రెండో దశ కరోనాలో భారీ జన నష్టాన్ని చవిచూసినందువల్ల ఆ వ్యాక్సిన్‌లను భారత్‌లోనే తయారుచేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా జైశంకర్‌ చర్చిస్తారు. వ్యాక్సిన్‌ తయారీ విధానంపై వున్న పేటెంట్‌ హక్కుల్ని తాత్కాలికంగా సడలించి, వెనకబడిన దేశాలు సైతం వాటిని స్వేచ్ఛగా ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో గత అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతోపాటు మన దేశం కోరినప్పుడు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభా మొత్తం సాధ్యమైనంత త్వరగా కరోనా నియంత్రణ టీకాలు వేసుకుంటేనే అన్ని దేశాలూ సురక్షితంగా వుండగలవని, ఈ విషయంలో ఎవరు వెనకబడినా అందరికీ ప్రమాదమేనని మన దేశం వాదించింది. ఈ అంశాలన్నీ మరోసారి చర్చల్లోకొస్తాయి. పేటెంట్ల సడలింపులో యూరప్‌ దేశాలను ఒప్పించమని జైశంకర్‌ కోరే అవకాశం వుంది. 

ట్రంప్‌ ఏలుబడిలో అమెరికా నిరాసక్తత వల్ల బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ తప్పదన్న అభిప్రాయం కలగడంతో మన దేశం యూరప్‌ దేశాల చొరవకు అనుకూలంగా స్పందించింది. అలాగే చైనాతో సంబంధాలు పెంచుకోవటానికి, రష్యాతో వున్న మైత్రీబంధాన్ని మరింత విస్తరించుకోవటానికి ప్రయత్నించింది. కానీ జమ్మూ–కశ్మీర్‌ ప్రతిపత్తి మార్చిన తర్వాత చైనా మన దేశం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించటం, దానికి ముందూ తర్వాత కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించటం వగైరా పరిణామాలు...ఈలోగా బైడెన్‌ ఆగమనం తర్వాత అమెరికా మళ్లీ అంతర్జాతీయంగా చురుకైన పాత్ర పోషించటం మొదలుపెట్టడంతో ఇరు దేశాలూ దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న జైశంకర్‌ తాజా పర్యటనతో ఈ బంధం మరింత చిక్కబడుతుందని భావించాలి.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top