ప్రశాంత కశ్మీర్‌కు మార్గం | Sakshi
Sakshi News home page

ప్రశాంత కశ్మీర్‌కు మార్గం

Published Sat, Apr 13 2024 12:08 AM

Path to a peaceful Kashmir - Sakshi

జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్‌పూర్‌ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్‌ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు.

ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్‌లో పూంచ్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్‌లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. 

జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్‌లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి.

ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్‌లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్‌లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్‌ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్‌ సంస్థల భూదాహం లద్దాఖ్‌ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో లద్దాఖ్‌ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది.

తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్‌లకూ, కార్గిల్‌లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి.

ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి  దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్‌లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్‌ తాను బలంగావున్న ఉదంపూర్‌–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్‌నాగ్‌–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం.  
 
ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్‌ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్‌ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. 

Advertisement
Advertisement