
విజయం గ్యారెంటీగా దక్కుతుందంటేనే పోరాడాలన్న దృక్పథం ఉంటే ఈ ప్రపంచం ఇంతగా మారేది కాదు. ప్రగతి బాటన పయనించేది కాదు. యుద్ధాల్లో గెలిచేవీ ఉంటాయి, ఓటమికి తలవంచేవీ ఉంటాయి... పోరు మాత్రం ఆగొద్దని పసిఫిక్ మహాసముద్ర మారుమూల ప్రాంతంలో 300 ద్వీప సమూహాలతో కూడిన ఒక చిన్న దేశం ఫిజీలో సంకల్పం చెప్పుకున్న 27 మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు రాజేసిన ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఎన్నదగ్గ తీర్పు నివ్వటానికి దోహదపడింది.
వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ బాధ్యత అన్ని దేశాలకూ ఉంటుందనీ, ఈ ధరిత్రిని పరిరక్షించటం సకల దేశాల చట్టబద్ధ కర్తవ్యమనీ ఐసీజే వెలు వరించిన ఈ తీర్పు అందరినీ ఆలోచింపజేస్తోంది. తమ తమ దేశాల న్యాయస్థానాలనే బేఖాతరు చేస్తున్న ఏలికలు తామర తంపరగా పెరిగిన వర్తమానంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏ దేశమైనా పట్టించుకుంటుందని, అమలు చేస్తుందని భావించటం దురాశే కావొచ్చు. ఆ తీర్పు కేవలం సలహా పూర్వకమైనదే.
కానీ బాధ్యతా రహితంగా వాతావరణానికి చేటు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటూ భూగోళపు మనుగడకే ముప్పు తెస్తున్న దేశాలపై నైతిక ఒత్తిడికి అది దోహద పడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదపుటంచుల్లో జీవనం సాగి స్తున్న ద్వీపకల్ప దేశాల గోడు ప్రపంచమంతా వినటానికీ, పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనల వెనకున్న వాస్తవ స్థితిగతుల్ని ప్రజానీకం అర్థం చేసుకోవటానికీ అది తోడ్పడుతుంది. ఈకృషిలో పాలుపంచుకున్న వన్నీ ద్వీపకల్ప దేశాలు. భూతాపోన్నతి హెచ్చితే సముద్ర మట్టాలు పెరిగి ముందుగా మునిగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానివి.
భూగోళాన్ని 2050 కల్లా ఉద్గారాల రహితంగా మార్చాలన్న సంకల్పంతో 2015లో కుదిరిన ప్యారిస్ ఒడంబడికను అమెరికా బేఖాతరు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి ఏలుబడిలో ఒకసారి దీన్నుంచి బయటకొస్తున్నట్టు ప్రకటించగా, అటుతర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం మళ్లీ చేరింది. రెండోసారి వచ్చాక ట్రంప్ మళ్లీ ఒడంబడిక నుంచి నిష్క్రమించారు. బయటకు పోలేదన్న మాటేగానీ... ఒడంబడికపై సంతకాలు చేసిన ఇతర సంపన్న దేశాలు సైతం దాన్ని నీరుగార్చే విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఒడంబడిక నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నతమైనవి. వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తే భూగోళం సురక్షితంగా ఉంటుంది.
భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేయాలని, 2050–100 మధ్య అన్ని దేశాలూ శిలాజ ఇంధనాల ప్రమేయం లేని ఆర్థిక వ్యవస్థల రూపకల్పనకు దోహదపడాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం కార్యాచరణ ఏ విధంగా ఉన్నదో ప్రతి అయిదేళ్లకూ సమీక్షించాలని సూచించింది. ఆర్థిక స్తోమత అంతగా లేని దేశాలకు సంపన్న రాజ్యాలు చేయూతనివ్వాలని, హరిత ఇంధన సాంకేతికతలను చవగ్గా అందించాలని కూడా కోరింది. ఏం చేయాలో చెప్పిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు ఎలా చేయాలో చెప్పలేదు.
నిర్దిష్టమైన చర్యలకు కట్టుబడి ఉంటామని సంతకాలు చేసిన దేశాలు విఫలమైన పక్షంలో తీసుకోదగిన చర్యలేమిటో ప్రకటించలేదు. అందుకే ఆ ఒడంబడిక అమలు నత్తనడక నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీజే తీర్పు ప్రపంచ పౌరులందరిలో ఆలోచన రేకెత్తించి, తమ తమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటానికి తోడ్పడుతుంది. ఎవరికీ పట్టని, ఎవరూ పరిగణనలోకి తీసుకోని ఈ సమస్య తీవ్రతను చాటడానికి తొలుత ఫిజీలోని దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుం బిగించారు. ఒక తరగతి గదిలో చర్చగా మొదలైన ఈ అంశం వాతావరణ మార్పులపై పోరాడే పసిఫిక్ ఐలాండ్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ ఛేంజ్ (పీఐఎస్‌ఎఫ్‌సీసీ) అనే సంస్థ ఆవిర్భావానికి 2019లో అంకురార్పణ చేసింది.
ఈ సంస్థ పసి ఫిక్ ద్వీపకల్ప దేశాలను ఒప్పించటంతోపాటు అలాంటి ప్రమాదం పొంచివుండే మరికొన్ని దేశాలు కూడా కలిసివచ్చేలా చేసింది. ద్వీపకల్ప దేశం వనౌతు ఇందుకు చొరవచూపింది. చూస్తుండగానే యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇందులో భాగస్వామ్యం తీసు కున్నాయి. వివిధ దేశాలతో మూడు రౌండ్ల చర్చల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టే తీర్మా నంపై 105 దేశాలు సంతకం చేశాయి. ఐసీజే అభిప్రాయాన్ని కోరుతూ 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందటం, అది ఐసీజేకు చేరటం జరిగిపోయింది.
నిజానికి ఒడంబడిక కుదిరేనాటికి వాతావరణ మార్పుల వల్ల పొంచివున్న ముప్పు గురించిన ప్రత్యక్షానుభవం ఈ స్థాయిలో లేదు. ఈ పదేళ్లలో ధనిక, బీద దేశాల తారతమ్యం లేకుండా అన్నిచోట్లా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. లక్షలమంది ప్రాణాలు తీస్తున్నాయి. రుతువులు పూర్తిగా గతి తప్పాయి. ఏదోమూల అతివృష్టి, అనావృష్టి రివాజుగా మారాయి. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల అంటురోగాల వ్యాప్తితోపాటు మానసిక వ్యాధులు సైతం పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించారు.
కానీ సంపన్న దేశాల నిర్లక్ష్యం ఎలావుందో చెప్పుకోవటానికి నిరుడు అజర్‌బైజాన్ రాజధాని బాకూ నగరంలో జరిగిన ‘కాప్–29’ సదస్సే నిదర్శనం. ప్యారిస్ ఒడంబడికతో పడే ఆర్థిక భారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై జరిగిన ఆ సదస్సుకు దాదాపు సంపన్న దేశాలన్నీ ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో ఐసీజే వెలువరించిన తాజా తీర్పు ఈ బాపతు దేశాల కళ్లు తెరిపించటానికీ, వాతావరణం మరింత అధ్వాన్నం కాకుండా ఉండటానికీ దోహదపడుతుందని ఆశించాలి.