జీ–7 అసంబద్ధ నిర్ణయం | The G7 is likely to create a law similar to that of the US | Sakshi
Sakshi News home page

జీ–7 అసంబద్ధ నిర్ణయం

Published Sat, Jun 15 2024 4:30 AM | Last Updated on Sat, Jun 15 2024 4:30 AM

The G7 is likely to create a law similar to that of the US

పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్‌ ట్రంప్‌కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్‌ నిష్క్రమించి జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. 

అదే బైడెన్‌ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్‌ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్‌ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్‌ను బతిమాలుతోంది. 

మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్‌ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్‌ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?

ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల  (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు.

 నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్‌ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. 

‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్‌ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. 

ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్‌ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.

బైడెన్‌కూ, ట్రంప్‌కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్‌ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్‌ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement