ఖర్చుతంగా దోచేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ఖర్చుతంగా దోచేద్దాం..

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల్లో గెలుపు కోసం రూ.కోట్లు ఖర్చు చేద్దాం.. గెలిచాక పుష్కరాల అభివృద్ధి పనుల ద్వారా తిరిగి రాబట్టుకుందాం అంటూ కీలక నేతల హామీలతో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల వేళ కూటమి అభ్యర్థులు ధనప్రవాహం సాగిస్తున్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాలకు పదును పెట్టారు. ధనం, మద్యం పంపిణీని తీవ్రతరం చేశారు. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు రూ.కోటికి పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన కొందరు అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచార ఏర్పాట్లు చేస్తున్నారని, డివిజన్లలో టెంట్లు వేసి కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యాలయాల నుంచి ప్రచార కార్యకలాపాలతో పాటు ఇతర వ్యవహారాలను సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఇద్దాం.. తర్వత బొక్కేద్దాం

కార్పొరేషన్‌ పరిధిలో త్వరలో చేపట్టబోయే పనుల్లో అవకాశాలు కల్పిస్తామని, ఎన్నికల్లో చేసిన ఖర్చుకు అనేక రెట్లు సంపాదించుకోవచ్చని కొందరు కీలక ప్రజాప్రతినిధులు అభ్యర్థులకు హామీలిస్తున్నారన్న ప్రచారం ఉంది. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఘాట్లు, రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. సుమారు రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో పనులు చేపడతామని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ఆ పనుల్లో పది శాతం కూడా నేటికీ ప్రారంభించలేదు. పుష్కరాలకు కొద్ది రోజుల ముందు కావాల్సిన వారికి పనులు కేటాయించేసి... హడావుడిగా పూర్తి చేసి భారీగా డబ్బులు వెనకేసుకోవచ్చన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వంలోని కీలక నాయకులు ఉన్నారు. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే పుష్కర పనుల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు... ఇప్పుడు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయండి అని కీలక ప్రజాప్రతినిధులు హామీలిస్తున్నారు. ఇదే అదునుగా కూటమి పార్టీల అభ్యర్థులంతా భారీగా ఖర్చు చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించాల్సిన పనులను రాజకీయ నాయకులు స్వార్థంతో దోచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజాధనానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని.. అందుకే పుష్కరాల పనుల అంచనాలు, టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

అలా ‘మందు’కుపోతూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రివేళల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రచార కార్యాలయాల వద్ద జరిగే కార్యకలాపాలు, మద్యం నిల్వలు, తరలింపు, పంపిణీపై తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఓటర్లకు నగదు, మద్యం, కానుకలు పంపిణీ చేయడాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిషేధిస్తోంది. అయితే మద్యం దుకాణాలు, ఇసుక ర్యాంపులు, మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాల ద్వారా సంపాదించిన సొమ్మును కొందరు ఎన్నికల కోసం వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందువల్లే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఫ మరోవైపు కూటమి పార్టీల నుంచి టిక్కెట్లు దక్కక స్వతంత్రులుగా బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తిరిగి ఏదో ఒక పార్టీలోకి చేరవచ్చన్న రాజకీయ లెక్కలతో కొందరు పోటీలో కొనసాగుతున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

చిన్న నాయకులకూ భారీగా ఆఫర్లు

మరోవైపు ఎన్నికల ఫలితాలను ప్రలోభాలతో ప్రభావితం చేసేందుకు కూటమి పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. డివిజన్‌ స్థాయిలో ప్రభావం చూపగల నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆఫర్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీతో సంబంధం లేకుండా స్థానికంగా పలుకుబడి ఉన్నవారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను రోజువారీగా నమోదు చేయాలి. ఎన్నికల వ్యయానికి నిర్దేశించిన పరిమితులను పాటించాలి. నగదు, మద్యం పంపిణీ, ఓటర్లకు ప్రలోభాలు, భారీ నగదు తరలింపు వంటి అంశాలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు చర్యలు తీసుకునే వ్యవస్థ ఉంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎన్నికల అధికార యంత్రాంగం ముందు పలు ప్రశ్నలు నిలుస్తున్నాయి. అభ్యర్థుల ప్రచార కార్యాలయాల ఖర్చులను పరిశీలిస్తున్నారా? మద్యం పంపిణీ ఆరోపణలపై తనిఖీలు నిర్వహించారా? నగదు ప్రలోభాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? అభ్యర్థుల అధికారిక ఖర్చుల లెక్కలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న ప్రచార వ్యయాలకు పొంతన ఉందా? అన్న అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది.

ఫ ఎన్నికల వేళ ‘కూటమి’ ఎత్తుగడ

ఫ ప్రతి డివిజన్‌లో

రూ.కోటికిపైగా ఖర్చుకు సిద్ధం

ఫ తిరిగి పుష్కర పనుల్లో

దోచుకోవచ్చని కీలక నేతల హామీ

ఫ రూ.వేల కోట్ల అభివృద్ధి

పనులపై ఇప్పటి నుంచే కన్ను

ఫ రాత్రి వేళల్లో విచ్చలవిడిగా

మద్యం పంపిణీ

అనుమానాలకు తెరపడేదెప్పుడో..?

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు కోట్లాది మంది భక్తుల సౌకర్యాలు, నగర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. అలాంటి పనుల కాంట్రాక్టులపై ఎన్నికల సమయంలోనే ఆరోపణలు రావడం శోచనీయం. రాజకీయ నాయకులపై వినిపిస్తున్న ఆరోపణల్లో నిజమెంతో నిష్పక్షపాత విచారణలో తేలాలి. అదే సమయంలో పుష్కరాల నిధుల మంజూరు, పనుల కేటాయింపు, నాణ్యత పర్యవేక్షణకు పారదర్శక విధానాలను ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. భక్తుల కోసం వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి. ఎన్నికల పెట్టుబడులు, భవిష్యత్తు కాంట్రాక్టుల మధ్య సంబంధం ఉందన్న ఆరోపణలపై అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వకపోతే ప్రజాధనంపై అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement