ధరల భారమంట! | - | Sakshi
Sakshi News home page

ధరల భారమంట!

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

సాక్షి, రాజమహేంద్రవరం: అనంతపురంలో ఎదురైన అనూహ్య ఫలితం.. ఇప్పుడు రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల చర్చలో ప్రధానాంశంగా మారింది. కూటమి పొత్తులో భాగంగా అనంతపురం మేయర్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయించినా, ఆ పార్టీ అభ్యర్థిని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఓడించారు. తాజాగా రాజమహేంద్రవరం మేయర్‌ స్థానాన్ని కూడా బీజేపీకే కేటాయించడంతో అనంతపురం ఫలితమే ఇక్కడా రిపీట్‌ అవుతుందని నగరవాసులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ కూడా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థే విజయం సాధించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అధికార పార్టీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుందని తేలిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీస్తున్నారు. కూటమి నాయకులను నమ్మి మోసపోయామని, సరైన సమయంలో ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గెలుపు ధీమాతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు.

పింఛన్‌.. విసిగించెన్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు అండ్‌ కో ఊరూరా ఊదరగొట్టింది. తీరా అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లు దాటిన వారికే పింఛన్లు ఇవ్వలేదు. ఇంకా 50 ఏళ్ల వారికి ఎక్కడ ఇస్తారు. మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం సిటీ నుంచి 7,244, రూరల్‌ నుంచి 4,940 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలలుగా నిరీక్షణే తప్ప మంజూరు లేదు.

నిరుద్యోగులకు నిలువునా దగా

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చెల్లించేస్తామని చంద్రబాబు ఎన్నికల వేళ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క నిరుద్యోగికీ రూపాయి సాయం చేసి ఆర్థిక భరోసా కల్పించింది లేదు. చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయామని వేలాది మంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలో 40 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.

ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నా.. అభివృద్ధి శూన్యం

రాజమహేంద్రవరం నగరంలో బీజేపీకి ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పెద్దగా లేవని నగరవాసులు పెదవివిరుస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు...? ఏ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది? వాటిలో ఎన్ని పూర్తయ్యాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి పుష్కరాల కోసం కేంద్రం నుంచి నేరుగా అసలు నిధులు విడుదల చేయలేదని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫ మరోవైపు రాజమహేంద్రవరం ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఆమె నగరంలో అందుబాటులో ఉంటారని... కేవలం పర్యాటకురాలిలా నగరానికి వచ్చి వెళ్లిపోతున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

సమన్వయం అంతంతమాత్రమే

కార్పొరేషన్‌లో 72 డివిజన్లు ఉండగా పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు స్థానాలే కేటాయించారు. ఆ పార్టీలోని ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి నెలకొంది. మేయర్‌ స్థానం బీజేపీకి దక్కినా డివిజన్ల స్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తల సహకారం కీలకం. వాస్తవానికి రాజమహేంద్రవరం మేయర్‌గా పోటీ చేయాలని టీడీపీలోని చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. జనసేన నాయకులు కూడా అవకాశమిస్తారని భావించారు. అయితే రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో వారంతా నీరసించిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని సైలెంట్‌ అయిపోయారు. ఓ కీలక ప్రజాప్రతినిధి రిజర్వేషన్లు తారుమారు చేయించారనే అసంతృప్తి కూడా మూడు పార్టీల్లోని నాయకుల్లో తీవ్రంగా ఉంది. మూడు పార్టీల నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం అంతంతమాత్రంగానే ఉందని తెలుస్తోంది. అందువల్ల ఇక్కడ కూడా అనంతపురం ఫలితమే రిపీట్‌ అవుతుందని నగరవాసులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో నగరాభివృద్ధి, సంక్షేమ హామీల అమలు, స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలపై ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు.

ఆడబిడ్డకు మోకాలడ్డు

ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామన్న హామీ నేటికీ అమలుకాక అతివలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో చూసుకుంటే మొత్తం 4,63,322 మంది ఓటర్లలో 2,39,615 మంది మహిళలే. అంటే 51.7 శాతం ఉంది. ఇందులో సుమారు 1.2 లక్షల మందికిపైగా ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు. గడిచిన 30 నెలల పాలనలో వారిని కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో బీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలతో ఆర్థిక భరోసా దక్కేదని వారు గుర్తు చేసుకుంటున్నారు.

నిత్యావసరాల సరకుల ధరలు, ముఖ్యంగా సన్నబియ్యం ధరలపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో కిలో సన్నబియ్యం రూ.50 నుంచి రూ.80 దాటేసింది. అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ధాన్యం ధరలపై నియంత్రణ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజంతా కష్టపడి ఇంటికి చేరే చిరు వ్యాపారులు, రోజు వారీ కూలీలు కడుపునిండా నాలుగు ముద్దల అన్నం తినే పరిస్థితి లేకుండా పోయింది.

అతీగతీ లేని పుష్కర పనులు

చారిత్రక రాజమహేంద్రవరం నగరానికి గోదావరి పుష్కరాల దృష్ట్యా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే పుష్కర ఘాట్ల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంది. నగరంలో పలుచోట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షపు నీరు నిలిచిపోవడం, డ్రైనేజీ సమస్యలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. చిన్నపాటి వర్షానికే నగరంలోని కీలక ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం ఎన్ని నిధులు మంజూరయ్యాయో ఎవరికీ చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement