దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.1,521 కోట్ల విలువైన 55.74 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేసినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. 2025–26 పంట కాలంలో 85 మిలియన్ల కిలోలు పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 55.74 మిలియన్ల కిలోలు విక్రయాలు జరిగినట్టు ఆయన తెలిపారు. మరో 30 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రీజియన్ పరిధిలో రోజుకు సుమారు 3 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతుందన్నారు. కిలో గరిష్ఠ ధర స్వల్పంగా పెరిగిందన్నారు. కిలో గరిష్ఠ ధర రూ. 349, కనిష్ఠ ధర రూ. 80, సగటు ధర రూ. 273.02 పలికినట్టు ఆయన తెలిపారు. 4,261 బేళ్లు అమ్మకానికి రాగా, 2,987 బేళ్లు కొనుగోలు జరగ్గా, 1,274 బేళ్లు తిరస్కరించినట్టు వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 8.07 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 12.20 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 12.92 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 11,78 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 10.75 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు జరిగినట్టు ఆయన వివరించారు.


