సాక్షి, రాజమహేంద్రవరం: ‘అయ్యా.. నా భర్తను ఏమీ చేయకండి. ఆయన దొంగ కాదు. ఆయన ఓ బైక్ మెకానిక్. మాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే నా బిడ్డలు అనాథలైపోతారు. మీ కాళ్లు పట్టుకుంటా.. నా భర్తను చంపొద్దు... వదిలేయండి’ అంటూ ఓ అభాగ్యురాలు కన్నీటితో వేడుకుంది. తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఫోన్లోనే పదేపదే ప్రాధేయపడింది. అయినా ఆ మనసులు కరగలేదు. ఆమె కన్నీళ్లు వారిలో కనీస కనికరాన్ని కలిగించలేదు. చివరకు భర్త తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూసిన ఆ ఇల్లాలికి తీరని శోకమే మిగిలింది. నాన్న వస్తాడని ఎదురుచూసే ఇద్దరు చిన్నారులకు తండ్రి ప్రేమ శాశ్వతంగా దూరమైంది. చేతికందిన కొడుకు తమకు చివరి రోజుల్లో అండగా ఉంటాడనుకున్న వృద్ధ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కోళ్ల దొంగతనం అనుమానంతో తిమ్మసత్తి నరేష్ (36)పై జరిగిన అమానుష దాడి ఓ కుటుంబాన్ని నిలువునా కూల్చేసింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలో టీడీపీ నాయకుడు బులుసు సురేంద్రచౌదరి ఆధ్వర్యంలో చోటుచేసుకున్న ఈ అమానుష, ఆటవిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది.
కొట్టి.. చిత్రహింసలు పెట్టి..
కోళ్ల దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో గురువారం రాత్రి తిమ్మసత్తి నరేష్‌ను పట్టుకున్న వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ రాత్రంతా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులకు అప్పగించాల్సిన వ్యక్తిని తమ వద్దే నిర్బంధించి రాత్రంతా చలిలోనే ఆరుబయట విచక్షణా రహితంగా కొట్టి వదిలేశారు. రాత్రంతా దెబ్బలు తిన్న నరేష్‌కు తెల్లవారినా చిత్రహింసలు తప్పలేదు. శుక్రవారం ఉదయం కోళ్లఫారం యజమాని బులుసు సురేంద్రచౌదరి వచ్చిన తర్వాత దాడి మరింత తీవ్రమైనట్లు మృతుని భార్య అఖిల, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆయన సమక్షంలోనే పలువురు మరోసారి నరేష్‌పై విరుచుకుపడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దొంగతనం జరిగిందని అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఒక మనిషిని నిర్బంధించి కొట్టే అధికారం ఎవరిచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరం చేశాడో లేదో తేల్చాల్సింది చట్టం. కానీ ఇక్కడ కొందరు తామే శిక్ష అమలు చేసేవారిగా వ్యవహరించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
అరణ్యరోదనగా ఆర్తనాదాలు
దాడి అనంతరం బులుసు సురేంద్రచౌదరితో పాటు అతని మనుషులు నరేష్ నుంచి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకున్నారు. తొలుత సురేంద్రచౌదరి వద్ద పనిచేసే వారు నరేష్ భార్య అఖిలకు ఫోన్ చేసి బెదిరించారు. ఆ తర్వాత సురేంద్రచౌదరి స్వయంగా ఫోన్ చేసి... నరేష్‌తోపాటు వచ్చిన వారిని తీసుకొచ్చి అప్పగిస్తేనే నీ భర్తను విడిచిపెడతామని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో అఖిల తీవ్ర భయాందోళనకు గురైంది. తన భర్త దొంగ కాదని, ఆయనతోపాటు వచ్చిన వారెవరో తనకు తెలియదని చెప్పి వేడుకుంది. తమకు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, భర్తకు ఏమైనా జరిగితే వారి బతుకులు రోడ్డున పడతాయని కన్నీటిపర్యంతమైంది. ఎంతగా బతిమాలినా ఫలితం లేకపోయింది. తన భర్తను ప్రాణాలతో ఇంటికి పంపించాలని ఆమె చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనగానే మిగిలాయి. అఖిలతో సురేంద్రచౌదరితో పాటు అతని మనుషుల సంభాషణ చాలా కర్కశంగా సాగింది. అనంతరం కొద్ది సేపటికే నరేష్ చనిపోవడంతో విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
రాత్రంతా చలిలోనే..
మూడు రోజుల క్రితం వరకూ తండ్రి ప్రేమను పొందిన ఇద్దరు చిన్నారులకు ఇప్పుడు ఆ ప్రేమ శాశ్వతంగా దూరమైంది. తమను ఎత్తుకుని ముద్దాడే నాన్న ఇక ఇంటికి రాడనే చేదు నిజాన్ని ఆ పసి మనసులు తట్టుకోకపోతున్నాయి. తొమ్మిదేళ్ల హన్విక, ఏడేళ్ల మనీష్‌కుమార్ తల్లి అఖిలతో కలిసే రాత్రంతా కోరుకొండ పోలీస్ స్టేషన్ వద్ద చలిలో నిరీక్షించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిలకు ఇప్పుడు వారి పోషణే పెను సవాలుగా మారింది. భర్తను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకోవాలో.. తండ్రి లేని పిల్లలను ఎలా పెంచాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి ఆమెది. మరోవైపు తమ కళ్ల ముందే పెరిగి పెద్దవాడైన కొడుకు అర్ధాంతరంగా కర్కోటకుల చేతిలో బలైపోవడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలవాల్సిన కొడుకు కళ్లముందే లేకుండా పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి మరణం ఆ ఇంట్లో ఎన్నో జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకవైపు భర్తను కోల్పోయిన దుఃఖం.. మరోవైపు ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుపై బెంగ.. ఇంకోవైపు న్యాయం జరుగుతుందో లేదోనన్న ఆందోళన. ఇన్ని బాధల నడుమ అఖిల తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రంతా కోరుకొండ పోలీస్‌స్టేషన్ వద్ద చలిలోనే నిరీక్షించడం చూపరుల హృదయాలను కలిచివేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైన వారిని శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.
ఫ ఇంటి పెద్ద మృతితో
రోడ్డున పడిన కుటుంబం
ఫ నాలుగు కోళ్ల కోసం
ప్రాణాన్నే హరించిన కర్కశులు
ఫ తండ్రి ప్రేమకు
దూరమైన ఇద్దరు చిన్నారులు
ఫ దిక్కుతోచని స్థితిలో
భార్య, తల్లిదండ్రులు
రిమాండ్‌కు నిందితులు
కోరుకొండ: మధురపూడి కోళ్లఫారంలో కోళ్ల చోరీకి వచ్చిన తిమ్మసత్తి నరేష్ (36)ను కొట్టి, హత్యకు కారణమైన ఘటనపై ఐదుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు నార్త్‌జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన తెలిపారు. మృతుడి భార్య అఖిల ఫిర్యాధు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం, గోకరాజుపల్లి గ్రామంలో మోటార్ సైకిల్ రిపేర్ చేసుకోవడానికి తన భర్త నరేష్ ఇంటి నుంచి వెళ్లాడని అఖిల అన్నారు. 20న తెల్లవారుజామున తన బావ గురవయ్యకు పదే పదే ఫోన్లు వచ్చాయని, ఫోన్లో కొందరు తన భర్త నరేష్‌ను నిర్బంధించి దుర్భాషలాడుతూ కర్రలతో కొడుతున్న వీడియోలు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఆయా నంబర్లకు ఫోన్లు చేసి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకున్నా వినలేదని అఖిల చెప్పారు. ఈ మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ, హత్యా నేరం కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు. ఈ ఘటనలో కోళ్లఫారం యజమాని, రాజమహేంద్రవరం రాజా సినిమా థియేటర్ సమీప వాసి బలుసు సాయి సురేంద్రచౌదరి ఏ–1గా, కోలమూరుకు చెందిన మాదబోయిన కొండయ్య ఏ–2గా, మధురపూడికి చెందిన జనిపల్లి చట్టిబాబు ఏ–3గా, సోదసాని వరప్రసాద్ ఏ–4గా, జనిపల్లి రాజబాబు (మహేష్)లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పంపినట్టు తెలిపారు.


