రాజానగరం: భారీ వర్షాలకు రాజానగరంలో దెబ్బతిన్న ప్రధాన రోడ్లకు ఆర్‌అండ్‌బీ అధికారులు సోమవారం మరమ్మతులు చేపట్టారు. తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలో టెలీఫోన్ ఎక్ఛ్సేంజ్, సినిమా థియేటర్, నూకాలమ్మ గుడి సెంటర్, స్టేట్ బ్యాంక్ ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. వారం రోజులకు పైబడి నిలిచి ఉండడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. దీనిపై రాకపోకలకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. గుంతలను పూడ్పిస్తున్నారు. అయితే గుంతలు ఇసుక మట్టితో పూడ్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, శాశ్వత పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
20, 24 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: శ్రీసత్యసాయి భక్తుల కోసం జిల్లా మీదుగా ఈ నెల 20, 24 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు. 20న శ్రీకాకుళం రోడ్డు– యలహంక (08555), 24న యలహంక – శ్రీకాకుళం రోడ్డు (08556) నంబర్ గల రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమహేంద్రవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగుతాయని వివరించారు.
గోదావరి పవిత్రతను
కాపాడుకుందాం..
పెరవలి: గోదావరి నది పవిత్రతను కాపాకుందామని టీటీడీ దాస సాహిత్యం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పీఆర్ ఆనందతీర్థాచార్యులు అన్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద సోమవారం సాయంత్రం గోదావరి నదికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోదావరి నదికి ఎంతో విశిష్ట స్థానం ఉందన్నారు. కార్తికం అంటే ఎంతో పవిత్ర మాసమని, ఇది హిందువుల భక్తి, ముక్తులకు ఏకై క మాసం అని తెలిపారు. అనంతరం గోదావరి నదికి పూజలు చేశారు. కార్యక్రమంలో పట్టణ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల జోరు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు సోమవారం సర్పంచ్ పదవులకు 193, వార్డు సభ్యుల స్థానాలకు 1,111 నామినేషన్లు పడ్డాయని జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి తెలిపారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో కోలమూరు సర్పంచ్ స్థానానికి 9, వార్డు సభ్యుల స్థానాలకు 64 నామినేషన్లు, కడియం మండలంలో సర్పంచ్ స్థానాలకు 32, వార్డు సభ్యుల స్థానాలకు 258 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా కొవ్వూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 60, వార్డు సభ్యుల స్థానాలకు 307 నామినేషన్లు, చాగల్లు మండలంలో సర్పంచ్‌కు 43, వార్డు సభ్యులకు 253, తాళ్లపూడి మండలంలో సర్పంచ్‌కు 49, వార్డు సభ్యులకు 229 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. జిల్లాలో రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలలకు 248, వార్డు సభ్యులకు 1326 నామినేషన్లు వచ్చాయన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని తెలిపారు.
మార్చురీలో జింబాబ్వే
విద్యార్థి మృతదేహం
కాకినాడ రూరల్: సూర్యారావుపేట బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి, ప్రమాదవశాత్తూ మృతి చెందిన జింబాబ్వేకు చెందిన విద్యార్థి ఫనేలే గుడ్‌విల్ ఎన్‌క్యూబ్ (22) మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. రెండు దేశాలకు సంబంధించి విషయం కావడంతో పోలీసులు ఇండియన్ ఎంబసీ నుంచి జింబాబ్వే ఎంబసీ ద్వారా ఆ దేశంలోని మృతుడి రక్త సంబంధీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆథరైజేషన్ లెటర్ రావాల్సి ఉంది. మృతదేహాన్ని జింబాబ్వే తరలించేందుకు అనుమతులు వచ్చిన తరువాత జీజీహెచ్ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తుంది. ఈ రికార్డింగ్‌ల సీడీని జింబాబ్వే పంపించాల్సి ఉంటుంది.


