సాక్షి, రాజమహేంద్రవరం: కొండగుంటూరు సమీపంలోని గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిజమేనని మైనింగ్ శాఖ సిబ్బంది నిర్ధారించారు. ఈ మేరకు ఆ శాఖ ఏడీ ఫణిభూషణ్రెడ్డి సోమవారం తెలిపారు. ‘కొండ.. హాంఫట్’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. ఆ ఎర్రకొండ వద్దకు చేరుకుని పరిశీలించారు. అయితే కొండగుంటూరును ఆనుకుని ఉన్న ఆ ఎర్రకొండ మండపేట మండలం కేశవరం రెవెన్యూ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు. సర్వే నంబరు 7/1లో ఐదెకరాల విస్తీర్ణంలోని కొండ డీపట్టా భూమిగా గుర్తించారు. అయితే రీ సర్వేలో వేరే వ్యక్తుల పేరున మారినట్లు తెలిపారు. ఇక్కడ అనుమతులు లేకుండా తవ్వకాలు జరపడం నిజమేనని చెప్పారు. కేశవరం రెవెన్యూ సిబ్బంది, గనుల శాఖ సర్వే బృందం రోవర్ సాయంతో సర్వే చేపట్టి, తవ్విన 9,370 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలించినట్లు తెలుసుకున్నారు. తవ్వకాలకు సంబంధించి అనుమతులు లేవని, అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు మైనింగ్ అధికారుల రాకను ముందుగానే తెలుసుకున్న గ్రావెల్ తవ్వకందారులు అక్కడి నుంచి జారుకున్నారు. యంత్రాలు, లారీలను వేరేచోటకు తరలించేశారు. అయితే అక్కడున్న గోతులు, వాహనాల టైర్లు ఆధారంగా గ్రావెల్ అక్రమంగా తవ్వేసి తరలించడం వాస్తవమేనని అధికారులు ధ్రువీకరించారు. జిల్లాల విభజన జరిగినప్పటికీ కొద్ది రోజుల క్రితమే మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల బాధ్యతను తూర్పు గోదావరి జిల్లా మైనింగ్ అధికారులకు అప్పగించారని ఏడీ ఫణిభూషణ్రెడ్డి పేర్కొన్నారు.
అక్రమ తవ్వకాలు పూర్తిగా ఆగేనా?
కేశవరం రెవెన్యూ పరిధిలోని కొండను కొల్లగొడుతున్న వారు అక్రమ తవ్వకాలను ఆపరని స్థానికులు అంటున్నారు. మైనింగ్ అధికారులు సోమవారం మధ్యాహ్నం వరకూ పరిశీలించి వెళ్లిపోయిన వెంటనే లారీలు తీసుకుని కొండ వద్దకు వచ్చారని... అప్పటికే తవ్వేసి ఉన్న గ్రావెల్ తరలించుకుపోయేందుకు సిద్ధమయ్యారని... ఎందువల్లో మళ్లీ వెనుతిరిగారని చెబుతున్నారు. ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమవడం.. మైనింగ్ అధికారుల పరిశీలన వల్ల వెనక్కి తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ రెండు మూడు రోజుల్లోనే అక్రమ తవ్వకాలు ప్రారంభించేస్తారని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు నిత్యం నిఘా ఉంచి పూర్తి స్థాయిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని... మరోవైపు కొండ విస్తీర్ణాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకందారులకు అడ్డుకట్ట వేయకపోతే ప్రకృతి సంపద కనుమరుగైపోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఫ నిర్ధారించిన మైనింగ్ శాఖ అధికారులు
ఫ ‘సాక్షి’ కథనంతో
వెలుగులోకి వచ్చిన తంతు


