రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఏపీ పేపర్ మిల్లులోని 150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి శుక్రవారం ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐలో పరీక్ష నిర్వహించారు. వీటికి 224 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్‌కుమార్ తెలిపారు. మిల్లు హెచ్‌ఆర్ అధికారులు ఈ పరీక్ష నిర్వహించారని, త్వరలోనే అర్హులను ఎంపిక చేస్తారన్నారు.
పీఏటీ దరఖాస్తుల
స్వీకరణ ప్రారంభం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్ (పీఏటీ)కు దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రూ.200 పరీక్ష ఫీజుతో ఈ నెల 20వ తేదీలోగా ఫీజు చెల్లించి, 21వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. గడువు దాటిన అభ్యర్థులు ఈ నెల 24లోగా రూ.60 ఆలస్య రుసుముతో రూ.260 ఫీజు చెల్లించవచ్చని, 25వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
‘నన్నయ’ వీసీకి యునెస్కో
వరల్డ్ ఎక్సలెంట్ అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీకి ప్రతిష్టాత్మక యునెస్కో వరల్డ్ ఎక్సలెంట్ అవార్డు – 2026 లభించింది. రాష్ట్రంలోని గిరిజనులకు సంబంధించిన 19 భాషలకు లిపి రూపొందించుటలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్‌లో శుక్రవారం ఉత్తర భారతదేశంలోని ప్రముఖ వ్యక్తుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మణికురి భాషకు శాసీ్త్రయ భాష హోదా కల్పించాలనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ అవార్డును ఆన్‌లైన్‌లో ప్రదానం చేశారు. అనంతరం వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ భాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదని, అది ఒక సమాజపు చరిత్ర, సంస్కృతి, జ్ఞానం, సంప్రదాయాలు, అస్తిత్వానికి ప్రతీక అన్నారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించడం ద్వారా వారి మౌఖిక సాహిత్యం, జానపద కథలు, సంప్రదాయ జ్ఞానాన్ని భవిషత్తు తరాలకు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మణిపురి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు గిరి ప్రసాద్ వర్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్ రెడ్డిని సంఘ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తమ సంఘం తరఫున ఉద్యోగుల పలు సమస్యలను నివేదించామన్నారు. అయితే మినిట్స్‌లో పొందుపరిచిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాజమహేంద్రవరం నగర శాఖ అధ్యక్షుడు జీబీ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులను ఎంతో ఓర్పు, సహనం, నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. అయినప్పటికీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులకు ఇప్పటికీ రెమ్యునరేషన్ అందలేదన్నారు. జిల్లాలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నికల బూత్‌లలో విధులు నిర్వహించినప్పటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదన్నారు.


