కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఆర్ట్స్ కళాశాల డిగ్రీ పట్టాల పంపిణీలో భాగంగా రెండో రోజు శుక్రవారం పీజీ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే రామచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు, ప్రముఖ విద్యావేత్తలు పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.బాబు మాట్లాడుతూ 2021– 23 బ్యాచ్‌లో 98.36 శాతం, 2022 – 24 బ్యాచ్‌లో 98.69 శాతం, 2023 – 25 బ్యాచ్‌లో 97.14 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ముఖ్య అతిథి డాక్టర్ సీహెచ్ తులసి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పెరుగుతున్నాయన్నారు. మరో ముఖ్య అతిథి, గౌతమి నేత్రాలయం చైర్మన్ డాక్టర్ వీకేరాజు మాట్లాడుతూ 173 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాల నుంచి పట్టాలు అందుకోవడం విద్యార్థులకు గర్వకారణమన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ వి.రాహుల్, తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్‌న్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం డీన్ ప్రొఫెసర్ పి.సురేష్ వర్మ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.వసంతలక్ష్మి, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.రాజేశ్వరి పాల్గొన్నారు.


