● రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురు విద్యార్థులు
● అభినందించిన ప్రముఖులు
అంబాజీపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న కాకినాడ, అనపర్తిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి పోటీల్లో పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్, వాలీబాల్, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఆ స్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం బీర ధర్మరాజు బుధవారం మాట్లాడుతూ అండర్ –19 విభాగం రన్నింగ్ 400 మీటర్లలో వాసంశెట్టి ఆకాష్ ప్రథమ, 100, 200 మీటర్లలో కొప్పిశెట్టి మనోజ్, 200 మీటర్లలో చీకిరిమిల్లి వర్షవర్ధిని, 4 కిలోమీటర్ల పరుగు పందెంలో చీరవరపు జయశ్రీ ద్వితీయ స్థానం సాధించారన్నారు. వాలీబాల్ అండర్–14 విభాగంలో చిన్నం దామినీ అక్షయ, బొక్కా సత్య అఖిల శ్రీజ, ఖోఖో అండర్– 14లో శాగా హరినాగ సత్యబాలజీ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఆ క్రీడాకారులతో పాటు తర్ఫీదునిచ్చిన పీడీలు అందె సూర్యనారాయణ, దొమ్మేటి ఉదయ భాస్కర్‌లను పలువురు అభినందించారు.
వాలీబాల్ పోటీలకు..
దేవరపల్లి: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టుకు గోపాలపురం మండలం చిట్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన నారాయణపురంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో చిట్యాల హైస్కూల్‌కు చెందిన మరపట్ల వాణి ప్రసాద్, వడలి కీర్తి సుధ, చమటపల్లి లోహిత, పీతల ధనుష్, పల్లపు ఆర్యానంద్, దొడ్డి పవన్ కుమార్, కొయ్య ప్రవీణ్ ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వైఎస్‌ఎన్ మూర్తి, పీడీ బి.సతీష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు తరపున వీరు పాల్గొంటారన్నారు.
ఖోఖో పోటీలకు..
కొత్తపేట: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు వానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కోనాల స్నేహలత ఎంపికై ంది. ఆ పాఠశాల హెచ్‌ఎం ముద్రగడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జిల్లా క్రీడా ప్రాంగణంలో జరిగిన ఎంపికల్లో ఖోఖోలో తమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కోనాల స్నేహలత ప్రతిభ చాటి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఏలూరు జిల్లా పూళ్లలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున పాల్గొంటుందన్నారు. ఆ బాలికతో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సలాది వెంకట రమణ, కె.అగ్నికుమార్‌లను అభినందించారు.
మల్లఖంబ్ రాష్ట్ర జట్ల ఎంపిక
భీమవరం: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రాష్ట్ర స్థాయి మల్లఖంబ్ ఎంపికలను భీమవరం పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్లో ల్‌లో నిర్వహించారు. ఇందులో భాగంగా అండర్–18 బాలురు, బాలికలకు పోల్, రోప్, హ్యాంగింగ్ పోటీలు జరిగాయి. వీటికి పశ్చిమ, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల నుంచి 36 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా మల్లఖంబ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నూతక్కి మోహన్‌దాస్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో బాలుర విభాగంలో తూర్పుగోదావరికి చెందిన కె.తనుజ్, జె.సతీష్, ఎ.లక్ష్మణ్, ఎ.రాము (స్టాండ్‌బై), బాలికల విభాగంలో కె.దేవి ఉన్నారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం
పిఠాపురం: స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ – 19 బాల బాలికల బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ పోటీలకు అబ్జర్వర్ గా అప్పలరాజు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి 260 మంది బాక్సర్లు తరలివచ్చారని పి.లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డీఆర్‌కే రెడ్డి, కళాశాల అధ్యాపకులు నాగేశ్వర్ రెడ్డి, ఎండీహుస్సేన్, సీనియర్ అసిస్టెంట్ పళ్ల సురేష్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, డి.రామకృష్ణ, కె.చిన్నబ్బాయి పాల్గొన్నారు.
క్రీడా సమాచారం


