13న అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

13న అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి పరీక్ష

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

రాజమహేంద్రవరం రూరల్‌: ఏపీ పేపరుమిల్స్‌ లిమిటెడ్‌లో సుమారు 100 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయడానికి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ధవళేశ్వరంలోని ప్రభుత్వం ఐటీఐలో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ సునీల్‌ కుమార్‌ బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, డాక్యుమెంట్‌ సివిల్‌, టర్నర్‌ ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆ రోజు జరిగే పరీక్షకు రావాలని కోరారు.

మౌలానా సేవలు

చిరస్మరణీయం

రాజమహేంద్రవరం సిటీ: స్వాతంత్య్ర సమర యోధుడిగా, విద్యావేత్తగా, జాతీయ నాయకుడిగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాలను బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి అబుల్‌ కలాం ఆజాద్‌ పటిష్ట పునాదులు వేశారన్నారు.

భారీ వర్షాలతో

అంటువ్యాధుల ముప్పు

రాజమహేంద్రవరం రూరల్‌: తుపానుల కారణంగా కురిసిన భారీ వర్షాలతో నీరు నిల్వ ఉండడం, తాగునీటి వనరులు కలుషితం కావడం, పరిసరాలు అపరిశుభ్రంగా మారడం జరిగిందని, తద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ పి.కోమల అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చల్లార్చిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని, నీటిని శుభ్రమైన, మూత ఉన్న పాత్రల్లో నిల్వ చేసుకోవాలన్నారు. వేడిగా వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, భోజనం చేసే ముందు, మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. .

స్థానిక సంస్థల ఎన్నికల్లో

ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రకాశం నగర్‌(రాజమహేంద్రవరం): ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ బుధవారం శ్యామలా సెంటర్‌లో ఆ రెండు పార్టీల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. తాటిపాక మధు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, రాజకీయ బెదిరింపులకు పాల్పడటం, అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం ప్రజాస్వా మ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అరుణ్‌ మాట్లాడుతూ పోలీసుల పక్షపాత వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిందని విమర్శించారు. బలవంతపు ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపి, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఓటర్లు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును ప్రభుత్వాలు కాపాడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement