అమ్మితే మేలు.. దక్కిందే చాలు | - | Sakshi
Sakshi News home page

అమ్మితే మేలు.. దక్కిందే చాలు

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

దేవరపల్లి: పొగాకు విక్రయాలు ఈ ఏడాది అనేక ఒడిదొడుకులతో సాగుతున్నాయి. 2025–26 కాలంలో పండించిన పొగాకు కొనుగోళ్లను గత ఏడాది మార్చి 25న ప్రారంభించగా, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎక్కువ రోజులు పొగాకు ఇళ్ల వద్ద నిల్వ ఉండడంతో రంగు, నాణ్యత దెబ్బతింటోంది. దీంతో చేసేది లేక వచ్చిన కాడికే అమ్ముకుంటున్నారు. దీంతో వర్జీనియా పొగాకు విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. టోబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు ఎనిమిది నెలలుగా కొనుగోళ్లు ప్రక్రియ జరుగుతోంది.

పెట్టుబడి కూడా రాక..

ఎకరంలో పొగాకు పండించడానికి రైతుకు సుమారు రూ. 3 లక్షల వరకు ఖర్చు కాగా, దాని మీద ఆదాయం రూ.2.50 లక్షలు మాత్రమే వస్తోంది. దీంతో పెట్టుబడి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎకరం పొలం రూ.70 వేలకు కౌలుకు తీసుకుని పొగాకు పండించారు. దీంతో పాటు రూ. 2.50 లక్షలు బ్యారన్‌ అద్దె చెల్లించారు. ఈ ఏడాది కిలో గరిష్ట ధర రూ. 290 ప్రారంభ ధరతో కొనుగోళ్లు ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలలు ఈ ధర కొనసాగింది. అనంతరం నెమ్మదిగా రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం రూ.346 పలుకుతోంది.

రూ.1,374.54 కోట్ల పొగాకు విక్రయాలు

రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం నాటికి రూ.1,374.54 కోట్ల విలువ గల 50.72 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ట ధర రూ.346, కనిష్ట ధర రూ.100, సగటు ధర రూ. 271.45 పలుకుతోంది. 2025–26 పంట కాలంలో పొగాకు బోర్డు రీజియన్‌ పరిధిలో 49.32 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, అధికారుల గణాంకాల ప్రకారం 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. సుమారు 36 మిలియన్ల కిలోలు అదనంగా ఉత్పత్తి జరిగింది. దీంతో 2026–27 పంట కాలంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పంట నియంత్రణ విధించింది. బ్యారన్‌కు 20 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలని, బ్యారన్‌కు రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేయాలని బోర్డు నిబంధనలు విధించి సాగుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది రైతులు సాగు చేపట్టారు.

తడిచిన బేళ్ల కొనుగోలు

రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రోజుకు 6,500 బేళ్లు వేలానికి వస్తున్నాయి. ఇప్పటి వరకు 50.72 మిలియన్ల కిలోల విక్రయాలు జరిగాయి. మరో 35 మిలియన్ల కిలోల పొగాకు రైతుల వద్ద ఉన్నట్టు అంచనా. మరో రెండు నెలలు కొనుగోళ్లు జరుగనున్నాయి. తుపానుకు తడిచిన పొగాకు బేళ్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం.

– జె.సురేంద్ర కుమార్‌, టొబాకో బోర్డు

రీజనల్‌ మేనేజర్‌, రాజమహేంద్రవరం

పొగాకు విక్రయాలు

(బుధవారం నాటికి)

వేలం కేంద్రం విక్రయం గరిష్ట సగటు

(మిలియన్లలో) ధర ధర

దేవరపల్లి 8.46 346.00 264.15

జంగారెడ్డిగూడెం–1 11.03 346.00 271.81

జంగారెడ్డిగూడెం–2 11.66 346.00 267.57

కొయ్యలగూడెం 10.64 346.00 272.05

గోపాలపురం 10.02 346.00 280.27

ఫ పొగాకు రైతుల అవస్థలు

ఫ వేలం కేంద్రాల్లో బేళ్ల విక్రయం

ఫ పెట్టుబడి కూడా రాని వైనం

ఫ కౌలు రైతుల పరిస్థితి దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement