శ్రీనివాసా.. చూడవయ్యా.. | - | Sakshi
Sakshi News home page

శ్రీనివాసా.. చూడవయ్యా..

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

గోవిందా గోవిందా అని శ్రీనివాసుని నామస్మరణ చేసుకుంటూ ద్వారకాతిరుమలకు బయలుదేరిన భక్తులకు రహదారి శాపంగా మారింది. భీమడోలు – ద్వారకాతిరుమల మధ్యలో అడగడుగునా గోతులు ఏర్పడడంతో ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు. వీధిలైట్లు కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు భక్తులు గాయాలపాలవుతున్నారు.

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్నతిరుపతికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. భీమడోలు – ద్వారకాతిరుమల మధ్య సుమారు 17 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డుపై అడుగడుగునా గోతులు దర్శనమిస్తున్నాయి. మరో వైపు కనీసం వీధిలైట్లు కూడా లేకపోవడంతో రాత్రి వేళ ప్రయాణం నరకంలా మారింది. చీకట్లో గోతులు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడుతున్నారు. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

పలు ఘటనలు

వెంకన్న దర్శనం కోసం చాలామంది భక్తులు ముందు రోజు రాత్రే ద్విచక్ర వాహనాలపై క్షేత్రానికి బయలుదేరుతున్నారు. వస్తున్న క్రమంలో చీకటిలో రహదారిపై ఏర్పడిన భారీ గోతులు కనిపించక ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి ఏలూరు నుంచి స్కూటీపై శ్రీవారి దర్శనానికి వస్తున్న ఎం.పద్మ, ఎం.రాజేశ్వరి ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద గోతిలో పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108లో వారిని భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అడుగడుగునా..

ఈ మార్గంలో పలు చోట్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ద్వారకాతిరుమలలో టీటీడీ సదనం ఎదురుగా, కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలోని మలుపు, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు ముందు, లక్ష్మీపురం టైల్స్‌ ఫ్యాక్టరీ వద్ద, జగన్నాథస్వామి ఆలయం ఆర్చిగేటు, గొల్లగూడెం చెరువు, సూర్యచంద్రరావుపేట చెరువు వద్ద, పంగిడిగూడెం హైస్కూల్‌ ఎదురుగా, ఆ గ్రామ శివారులో, కుమారి దాబా సమీపంలో, పొలసానిపల్లి గురుకుల పాఠశాల ఎదురుగా రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వీటిలో సూర్యచంద్రరావుపేట చెరువు, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

స్థానికులే స్వచ్ఛందంగా..

రోడ్డుపై ప్రమాదాల నివారణకు కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటుననారు. లక్ష్మీపురం టైల్స్‌ ఫ్యాక్టరీ వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గోతుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ద్వారకాతిరుమల టీటీడీ సదనం ఎదురుగా ఉన్న గోతిలో డ్రమ్ము పెట్టి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. కాగా.. రహదారి నిర్మించి పుష్కర కాలం కావొస్తున్నా వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడం, గోతులు ఏర్పడిన చోట శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కళ్ల ముందే ప్రమాదాలు

రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయమేస్తోంది. మా కళ్లముందే ఎంతో మంది భక్తులు, వాహనదారులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి.

– ఎస్‌కే ఇమాం సాహెబ్‌, తిమ్మాపురం

ఇంత నిర్లక్ష్యమా?

చిన్న తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఈ స్థితిలో ఉండటం బాధాకరం. రహదారి నిర్మించి పుష్కర కాలం కావొస్తున్నా వీధిలైట్లు లేవు. దీంతో దగ్గరకు వెళ్లే వరకు గోతులు కనిపించడం లేదు. వాటిని పూడ్చే శాశ్వత చర్యలు చేపట్టట్లేదు. నిత్యం భక్తులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం.

– గుమ్మడి శ్రీను, పంగిడిగూడెం

అధ్వానంగా చిన్నతిరుపతి రోడ్డు

బిక్కవోలు నుంచి

ద్వారకాతిరుమల వరకు గోతులమయం

ప్రయాణానికి భక్తుల అవస్థలు

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement