ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

ముమ్మిడివరం: మర్లపాలెం పంచాయతీ పరిధి కాశివారిపేటలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కాశివారిపేటకు చెందిన కాశి ఉమా శంకర్‌ అలియాస్‌ బన్నీ (22) మంగళవారం ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి కాశి విజయకుమారి, తండ్రి సత్యనారాయణ. అయితే సత్యనారాయణ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. దానికి విజయ కుమారియే కారణమని సత్యనారాయణ బంధువులు గొడవ పెట్టాడు. ఆమె నుంచి కుమారుడు ఉమాశంకర్‌ను వేరు చేశారు. దీంతో విజయకుమారి అమలాపురంలో ఓ ఇంటిలో అద్దెకు నివసిస్తోంది. ఉమా శంకర్‌ తాత మహలక్ష్మి ఇంటి దగ్గర మర్లపాలెంలో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉమాశంకర్‌ ఒక యువతతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని, ఆమె మాట్లాడటం మానివేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా.. విషయం తెలిసిన వెంటనే విజయ కుమారి మర్లపాలెం చేరుకుని, తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దానిలో అత్తింటి వారి ప్రమేయం ఉండవచ్చని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి కేసులో

ముగ్గురికి ఐదేళ్ల శిక్ష

నిడదవోలు: గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు ఏలూరు కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్‌ బుధవారం తెలిపిన వివరాల మేరకు.. 2022లో ఉండ్రాజవరం మండలం చివటం రైల్వే గేటు సమీపంలో గంజాయి కలిగిన ముగ్గురిని అప్పటి ఎస్సై కె.రామారావు, తన సిబ్బందితో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు అధికారైన అప్పటి నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరరావు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా ఆధారాలతో ఏలూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కమ్‌ ఎన్‌డీపీఎస్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రస్తుత విచారణ సమయంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్‌ పర్యవేక్షణలో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్‌, ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్‌లు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సంధ్య కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితులైన రాజమహేంద్రవరానికి చెందిన ఎండీ షఫి, కోసూరి విజయ్‌, బాలిబోని వెంకటేష్‌కు పైవిధంగా కోర్టు శిక్ష విధించింది.

లారీని ఢీకొట్టి డ్రైవర్‌ మృతి

కిర్లంపూడి: ఆగిన ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఎస్సై జి.సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మంగళవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ కలగ కుమార్‌ (40) అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement