● కొత్తగా ఇనుప మెట్లు నిర్మించేందుకు
టెండర్
● వాస్తు విరుద్ధమంటున్న పండితులు
అన్నవరం: అభివృద్ధి పని చేపడితే అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. అలాగే ఆమోదయోగ్యం కావాలి. అయితే అన్నవరం దేవస్థానంలో భక్తులు రాకపోకలకు మెట్ల మార్గాలు ఉన్నా, కొత్తగా ఇనుప మెట్ల నిర్మాణానికి టెండర్ పిలవడం విమర్శలకు తావిస్తోంది.. ఈ పనులు ఎవరి కోసం అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో కార్తికమాసం ఏర్పాట్లలో భాగంగా రూ.8.5 లక్షలతో ఆలయ ప్రాంగణం నుంచి యాగశాల వద్దకు కొత్తగా పది టన్నుల ఇనుముతో మెట్లు నిర్మించేందుకు అధికారులు టెండర్లు పిలవడం వివాదస్పదమవుతోంది. కార్తిక మాసంలో భక్తులు స్వామివారి దర్శనం అనంతరం దిగువకు వెళ్లేందుకు తూర్పురాజగోపురం ఎదురుగా మెట్లు ఉన్నాయి. అయితే ఈ మెట్లు భక్తులకు సరిపోవని 2023లో రావిచెట్టుకు ఎడమవైపు నుంచి స్వామివారి యాగశాల వద్దకు మెట్లు కట్టారు. ఆ మెట్లు పది అడుగుల వెడల్పున ఉండడంతో కార్తిక మాసంలో భక్తులు ఆ మెట్ల దారిలో రామాలయం వద్దకు వెడుతున్నారు. కార్తిక మాసంలో తూర్పురాజగోపురం ఎదురుగా గల మెట్ల దారిన భక్తులు దిగకుండా అక్కడ గేటు పెట్టి అందరినీ యాగశాల పక్కనే గల మెట్లు ద్వారానే పంపిస్తున్నారు.
వాస్తు విరుద్ధం!
సత్యదేవుని హోమాలు జరిగే యాగశాలకు తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు మెట్లు ఉన్నాయి. యాగశాల మెట్లను చేర్చి ఎడమ వైపున 12 అడుగుల వెడల్పున కొత్తగా మెట్లు కట్టాలని టెండర్ పిలిచారు. ఇవి నిర్మిస్తే యాగశాలకు దక్షిణ వైపు గల మెట్లను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. యాగశాల మెట్లు ఉండాలి తప్ప తొలగించడానికి వీలు లేదని, ఇది వాస్తు విరుద్ధమని పండితులు చెబుతున్నారు. కొత్తగా మెట్లు నిర్మిస్తే అవి యాగశాలకు మూడు అడుగులకు దగ్గర వరకు వస్తాయి. దీంతో యాగశాలలోకి దక్షిణం వైపు నుంచి వెళ్లేందుకు కూడా వీలు ఉండదు. అలాగే యాగశాలను సుమారు రూ.50 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన దాతలు నిర్మించారు. ఆ దాతల శిలాఫలకం కూడా అక్కడే ఉంది. ఈ మెట్లు నిర్మించడం వలన ఆ శిలాఫలకం కూడా కనిపించకుండా పోతుంది. ఇది ఆ దాతలను అగౌరవ పర్చడమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనిపై ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా ఈ మెట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన మాట వాస్తవమేనని, అయితే దీనిపై దేవస్థానం పండితులతో కూడిన వైదిక కమిటీ అభిప్రాయం కోరామని, వారు చెప్పినదాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.


