రాయవరం: సమ్మేటివ్–1 పరీక్షల నిర్వహణలో తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకు ఒక మండలంలోని టీచర్లను మరో మండలానికి కేటాయించడం ఉపాధ్యాయుల ఆగ్రహానికి కారణమైంది. స్కూల్ లెవల్ అబ్జర్వేషన్ (ఎస్‌ఎల్‌ఓ) విధానంలో భాగంగా ఒక మండలం నుంచి నియమించిన టీచర్ తనకు కేటాయించిన ఇతర మండలంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి పది పరీక్షల నిర్వహణను పర్యవేక్షించాలి. ఆ తర్వాత టీచర్లతో మూల్యాంకనం చేయించి వాటిని పరిశీలించి ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కులను లీప్ యాప్‌లో నమోదు చేయించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్‌ఎల్‌ఓలను నియమించారు. ఈ విధానం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గందరగోళం మధ్యనే..
వరుస తుపానులు, ఎన్నికల విధుల నేపథ్యంలో సమ్మెటివ్ అసిస్మెంట్–1 పరీక్షలు వాయిదా వేస్తారని భావించినా, షెడ్యూల్ మేరకు సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా, ఆదివారం మధ్యాహ్నం సమ్మెటివ్–1 పరీక్షల పర్యవేక్షణకు స్కూల్ లెవల్ అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. రాత్రికి రాత్రే రాష్ట్ర స్థాయి నుంచే ఒక మండలం హైస్కూల్ టీచర్లను పక్క మండలంలోని మరో ఉన్నత పాఠశాలకు అబ్జర్వర్లుగా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో విధులు నిర్వర్తించి తిరిగి మధ్యాహ్నం పనిచేస్తున్న పాఠశాలకు ఏ విధంగా రావాలని కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే మండలంలో కేటాయించకుండా దూరంగా ఉన్న మండలాలకు కేటాయించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల పేరుతో ఇబ్బందులు పడ్డామని, తిరిగి ఇప్పుడు మళ్లీ ఎస్‌ఎల్‌ఓలుగా నియమించారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎల్‌ఓ విధానంపై టీచర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు సమస్యను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాయి. దీనిపై ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఎస్‌ఎల్‌ఓలు ఏమి చేస్తారంటే..
భాషా పరీక్షలకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) పొరుగు మండలంలోని పాఠశాల నుంచి భాషేతర స్కూల్ అసిస్టెంట్లు పర్యవేక్షణ చేస్తారు. భాషేతర పరీక్షలకు (గణితం, పీఎస్, బీఎస్, సోషల్) పొరుగు మండలాల నుంచి లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు పర్యవేక్షణ చేయాలి. పరీక్ష జరిగే రోజు ఉదయం 8.30 గంటలకు ఎస్‌ఎల్‌ఓకు కేటాయించిన పాఠశాలకు హాజరవ్వాలి. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను పర్యవేక్షించాలి. కాపీయింగ్‌ను నివారించాలి. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను నమోదు చేయాలి. సమస్యలుంటే వెంటనే హెచ్‌ఎం/ఎంఈవోలకు నివేదించాలి. పరీక్షలు ప్రారంభమైన 4వ రోజు మూల్యాంకన పత్రాలను పరిశీలించాలి. కనీసం 5 శాతం లేదా 5 జవాబు పత్రాలను తనిఖీ చేయాలి. మార్కుల కేటాయింపు, మొత్తం మార్కులను సరి చూసి, తేడాలుంటే హెచ్‌ఎం/ఎంఈవోలకు తెలియజేయాలి. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రతి పరీక్ష తర్వాత మూడు పని దినాల్లో పాఠశాలలోనే పూర్తి చేయాలి. జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లరాదు. 7వ రోజు లోపు మార్కులు లీప్ యాప్‌లో నమోదు చేయాలి.
ఉప సంహరించుకోవాలి
సమ్మేటివ్ పరీక్షల పరిశీలనకు ప్రవేశ పెట్టిన ఎస్‌ఎల్‌ఓ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం మోడిఫికేషన్లు చేసేందుకు సిద్ధమైంది. అదే మండలంలోనే ఇతర పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసే విధంగా ఉత్తర్వులిచ్చారు. ఇది కూడా అసంబద్ధం. – ఈవీవీఎస్‌ఎస్‌ఆర్ ప్రసాదరావు,
జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, రాజమహేంద్రవరం.
తనిఖీలు ఎలా చేస్తారు?
ఇప్పటికే టీచర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఎల్‌ఓ విధానంలో ఒకే క్యాడర్‌కు చెందిన టీచర్లు అదే క్యాడర్‌లో ఉన్న టీచర్లను తనిఖీ చేయాలి. ఇది ఎంత వరకు సమంజసమో అధికారులు ఆలోచన చేయాలి. ఈ విధానాన్ని పూర్తిగా పీఆర్‌టీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. – వై.అగ్నేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ, తూర్పుగోదావరి జిల్లా.
ఫ సమ్మేటివ్–1 పరీక్షలకు ఎస్‌ఎల్‌ఓల
నియామకం
ఫ ఇతర మండలాలకు కేటాయించడంపై టీచర్ల అసహనం
ఫ ప్రభుత్వ నిర్ణయంపై టీచర్ల సంఘాల
మండిపాటు


