ఫ ప్రజలకు న్యాయ సహాయం అందించాలి
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జూనేద్ అహ్మద్ మౌలానా
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రజలకు న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనేద్ అహ్మద్ మౌలానా అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, న్యాయ సేవాధికార సంస్థకు మధ్య పారా లీగల్ వలంటీర్లు విశ్వసనీయమైన వారధిగా నిలవాలన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా, నిజాయితీతో, సంస్థ నిర్దేశించిన నిబంధనలు, విధి విధానాలకు లోబడి నిర్వహించాలన్నారు. సీనియర్ న్యాయవాది డాక్టర్ పి.త్రినాథరావు మాట్లాడుతూ సమాజంలోని అనేక మంది ప్రజలకు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశాలు, ప్రాథమిక హక్కులపై సరైన అవగాహన లేదన్నారు. అటువంటి వారికి పారా లీగల్ వలంటీర్లు అండగా నిలుస్తూ, న్యాయ సహాయం అందేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది డాక్టర్ పి.త్రినాథరావు తెలుగులో రచించిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, తరచూ అడిగే ప్రశ్నలు – వివరణ అనే పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనేద్ అహ్మద్ మౌలానా ఆవిష్కరించారు.


