ఫ సుబ్బాలమ్మ దేవస్థానం అర్చకుని
కుమారుడి మృతి
ఫ హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
ఫ ఆరు నెలల క్రితమే సాఫ్ట్‌వేర్ కొలువు
అమలాపురం టౌన్: కు మారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యో గం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో కుమారుడిని మృత్యువు కబళించి, తీరని శోకం మిగిల్చింది. అమలాపురం పట్టణ దేవత సుబ్బాలమ్మ దేవస్థానం అర్చకుడు కల్దారి సత్యనారాయణ కుమారుడు పరశురామ్ (25) హైదరాబాద్ షేక్ పేటలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో అమలాపురంలో విద్యుత్ నగర్‌లోని అర్చకుడు సత్యనారాయణ ఇంట విషాదం అలుముకుంది. ఆరు నెలల కిందటే పరశురామ్‌కు సాప్ట్‌వేర్ ఉద్యోగం రావడంంతో అర్చకుడి కుటుంబం ఆనందిస్తోంది. రెండు రోజుల కిందట అంటే దీపావళి రోజు హైదరాబాద్ షేక్ పేటలో రోడ్డుపై మోటారు సైకిల్‌పై వెళుతున్న పరశురామ్ అదుపు తప్పి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో వైద్యం ఖర్చు రూ.లక్షల్లో ఉండడం, అర్చకుడు ఆ ఖర్చును తట్టుకోలేకపోవడంపై అమలాపురంలో అనేక మంది దాతలు స్పందించి మంగళవారం సాయంత్రం రూ.రెండు లక్షలు విరాళాల రూపంలో సమకూర్చారు. అయినా ఫలితం లేక చివరకు పరశురామ్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. బతుకుతాడన్న ఆశతో, కష్టాల్లో ఉన్న అర్చకుడు సత్యనారాయణ కుటుంబాన్ని కొంతలో కొంత ఆదుకోవాలని విరాళా లు ఇచ్చిన దాతలూ ఆ యువకుడి మృత్యువార్త విని కన్నీటి పర్యంతమయ్యారు. దాతలు స్పందించి విరాళాలు ఇచ్చిన వారికి అర్చకుడు అదే కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. పరశురామ్ సోదరుడు అమలాపురంలోనే మరో ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు.


