క్లాప్‌.. స్టాప్‌.. | - | Sakshi
Sakshi News home page

క్లాప్‌.. స్టాప్‌..

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

రూ.700 కోట్ల బడ్జెట్‌ ఉన్నా!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సుమారు రూ.700 కోట్ల బడ్జెట్‌ ఉండగా, ఆస్తిపన్ను రూపంలోనే ఏటా సుమారు రూ.90 కోట్ల ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతటి ఆర్థిక వనరులు ఉన్న కార్పొరేషన్‌.. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నగర అభివృద్ధి, సుందరీకరణ, ఆధునిక సదుపాయాల కల్పన అంటూ ప్రకటనలు చేస్తున్న పాలకులు, అధికారులు ముందుగా ప్రాథమిక పారిశుధ్య సేవలను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులతో పాటు ఇంటింటికీ చెత్త సేకరణ కూడా నగరపాలక సంస్థ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. అలాంటి కీలక సేవను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్‌ సంస్థ నిర్వాకం వల్ల నిలిపి వేయాల్సిన పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించేందుకు 72 క్లాప్‌ వాహనాలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను స్వయంభూ అనే కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగించారు. అయితే స్వయంభూ నిర్వాహకులకు నగరపాలక సంస్థ నుంచి సుమారు రూ.4.5 కోట్ల మేర బిల్లులు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా కాంట్రాక్టర్‌ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా మూడు నెలలుగా జీతాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా వంటి పెద్ద పండగకు సైతం వేతనాలు అందకపోగా, దీపావళి నాటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.

కుటుంబ పోషణకు అప్పులు

కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, నిత్యావసరాల ఖర్చుల కోసం కార్మికులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వారి వేతనాలకు సంబంధించిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిలు కూడా పేరుకుపోయాయి. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెలా జీతాలు అందించలేని దుస్థితి నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోటిన్నర రూపాయల బకాయిలను నగరపాలక సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అవసరమైన మరమ్మతులు చేయించకపోవడంతో 12 వాహనాలు చాలాకాలంగా మూలనపడ్డాయి. మిగిలిన 60 వాహనాలకు గత పది రోజులుగా గ్యాస్‌ నింపకపోవడంతో వాటి సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. తాజాగా ప్రభుత్వం కొంత మొత్తం బకాయిలు విడుదల చేయడంతో మంగళవారం కొన్ని వాహనాల్లో గ్యాస్‌ నింపి చెత్త సేకరిస్తున్నారు. గతంలో రోజూ చెత్త సేకరణకు వెళ్లే వాహనాలు ఇప్పుడు రెండు మూడు రోజులకోసారి వెళుతున్నాయి.

ఫ చెత్త సేకరించే

క్లాప్‌ వాహనాలకు గ్రహణం

ఫ మూలకు చేరిన 12 వాహనాలు

ఫ కాంట్రాక్ట్‌ సంస్థకు బకాయిలతో

అధ్వాన సేవలు

ఫ తాజాగా కొంత మొత్తం విడుదల చేసిన అధికారులు

ఫ మూడు నెలలుగా కార్మికులకు

అందని జీతాలు

ఫ పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులూ పెండింగ్‌

రాజమహేంద్రవరంలో చెత్త సేకరణకు వెళ్లాల్సిన క్లాప్‌ వాహనాలు నిత్యం రోడ్ల పైకి రావడం లేదు. వాటిని నమ్ముకుని పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫలితంగా నగరంలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది.

కార్పొరేషన్‌ బాధ్యత తీసుకుంటుందా?

ప్రస్తుత క్లాప్‌ వాహనాల నిర్వహణ కాంట్రాక్టు డిసెంబర్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి నిర్వహణ బాధ్యతలను నగరపాలక సంస్థే నేరుగా చేపట్టాలని కార్మికులు, నగర వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ మారినప్పుడల్లా కార్మికుల ఉపాధి, వాహనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారకుండా చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లు, పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలను కొనసాగిస్తూ, వారి వేతనాలను నేరుగా కార్పొరేషన్‌ ద్వారా చెల్లించే విధానం తీసుకురావాలని సూచిస్తున్నారు. ముందుగా మూడు నెలల వేతన బకాయిలను ఒకేసారి చెల్లించడంతోపాటు కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడాదిన్నరగా ఇదే తంతు!

క్లాప్‌ వాహనాల నిర్వహణలో సమస్యలు ఇప్పుడే మొదలైనవి కావు. గత ఏడాదిన్నర కాలంగా ఇదే తరహా పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉండటం, వాహనాలకు మరమ్మతులు చేయకపోవడం, గ్యాస్‌ నింపకపోవడం, కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తలెత్తినప్పుడు అధికారులు హడావుడి చేయడం, కొద్ది రోజుల తర్వాత మళ్లీ యథాతథ పరిస్థితి నెలకొనడం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఇంతకాలంగా సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంపై నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ అనేది కేవలం కాంట్రాక్ట్‌ సంస్థ ఇష్టాయిష్టాలపై ఆధారపడే అంశంగా మారిపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement